సెలవులు ప్రకటించాలి
అంగన్‌వాడీలపై చిన్నచూపు తగదు
రోజు రోజుకు ఎండలు మండిపోతున్నాయి. వేసవి తీవ్రతకు మానవులతో పాటు పశుపక్షాదులు విలవిలలాడుతున్నాయి. వడదెబ్బకు భయపడి జనసంచారంలేక రోడ్లు కళావిహీనంగా ఉన్నాయి.దీని నుంచి ఉపశమనం కల్పించాలనే ఉద్వేశంతో విద్యార్థులకు వేసవిసెలవులు ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో అన్నిరకాల విద్యా సంస్థలకు ఈ నెల 24 నుంచి సెలవులు ప్రకటించారు.అయితే అంగన్‌వాడీ కేంద్రాలకొచ్చే చిన్నారులకు మాత్రం ప్రకటించడంలో సర్కార్ చోద్యం చూస్తోంది.ఫలితంగా కొందరు రావడం లేదు.
● వేసవి తీవ్రతతో విలవిల
● తగ్గుతున్న హజరు శాతం
● సెలవులు ప్రకటించని ప్రభుత్వం
● పక్క రాష్ట్రాల్లో మాత్రం హాలిడేస్
మదనపల్లె సిటీ: ఎండలకు వాడిపోతున్న చిన్నారుల ఇబ్బందులు కూటమి ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడంలేదు.భానుడు భగభగ మండిపోతుంటే ఎండలకు చిన్నారులు ఎలా వస్తారనే కనీస ఇంగిత జ్ఞానం లేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది.ఇప్పటికే పక్క రాష్ట్రం తెలంగాణాలో అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ఇచ్చారు.కానీ ఇక్కడ వేసవి సెలవులు ప్రకటించాలన్న ఆలోచన రాకపోవడం గమనార్హం.
అన్నమయ్య జిల్లాల్లో 1792 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటల్లో సంరక్షణ పొందుతున్న వారికి పౌష్టికాహారం అందించి, ఆటపాటలు, అక్షరాలు నేర్పించడం కార్యకర్తల విధులు. ఏడాది పొడవునా కేంద్రాల్లో చిన్నారులకు ఇదే పద్ధతి కొనసాగుతోంది.అయితే వేసవి సమీపించడంతో రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.కానీ అంగన్‌వాడీ కేంద్రాలకు దీన్ని వర్తింపజేయలేదు.దీంతో ఎండలకు చిన్నారులను పంపించేందుకు తల్లిదండ్రులు విముఖత చూపుతున్నారు. మండుతున్న ఎండలకు పెద్దలే గడపదాటి కాలు బయటికి పెట్టడానికి భయపడుతుంటే పిల్లలను ఎలా పంపిస్తామని ప్రశ్నిస్తున్నారు. కొందరు చిన్నారులు కేంద్రాలకు వస్తున్నా అక్కడవారికి గాలి లేకపోవడంతో ఉక్కపోతకు విలవిలలాడి పోతున్నారు. వీరిని సముదాయించలేక ఆయాలు తంటాలు పడుతున్నారు. వేసవిలో చిన్నారులను కేంద్రాల్లో ఉంచాలని చెబుతున్న ప్రభుత్వం వారికి చిరుతిండ్లు అందించడంలో శ్రద్ధ చూపడంలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సెలవులపై స్పష్టత లేదు
అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేసే కార్యకర్తలకు,ఆయాలకు చెరో 15 రోజులు సెలవులు ఇవ్వాల్సి ఉంది. మే 1 నుంచి 15 వరకు ఒకరికి, 15 నుంచి 30 వరకు ఒకరు సెలవు లు తీసుకోవచ్చు.అయితే దీనిపై స్పష్టత కొరవడింది.ఒకవేళ వంతుల వారీగా కార్యకర్తలు,అయాలు సెలవులు తీసుకోవచ్చని ప్రభుత్వం సూచించినా ఆయాలు చేసే పనులు మేము చేయాలా అనే ధోరణిలో అంగన్‌వాడి కార్యకర్తలు ఉన్నట్లు సమాచారం.చిన్నారుల పరిశుభ్రత పని ఆయాలదని, వారి పని కార్యకర్తలు చేసేందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది.
డిమాండ్లు పెడచెవిన పెట్టిన ప్రభుత్వం
ఎన్నికల సమయంలో మేం అడగకుండానే వివిధ రకాల హామీలు ప్రకటించారని, కానీ ఒక్కటీ నెరవేర్చక పోగా తమపై విపరీతమైన పనిభారం మోపడం ఎంతవరకు సమంజసమని అంగన్‌వాడీ కార్యకర్తలు వాపోతున్నా రు. తమ న్యాయమైన డిమాండ్లు నేరవేర్చాలని ఎండలు లెక్క చేయ కుండా ఒకవైపు వీరు పోరాటాలు చేస్తున్నా కూటమి ప్రభుత్వానికి జాలి, దయ లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఎండలు మండిపోతున్నా కేంద్రాలకు వేసవి సెలవులు ప్రకటించకుండా కక్ష పూరిత ధోరణి అవలంభిస్తోందని యూనియన్ నేతలు మండిపడుతున్నారు.
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు : 1792
6 నెలల నుంచి 3 ఏళ్లలోపు
చిన్నారులు : 34,354
3–6 సంవత్సరాల బాలలు : 20,460
గర్భిణులు : 7,477
బాలింతలు : 6,230
వైఎస్సార్ కడప జిల్లా కలసపాడులోని అంగన్‌వాడి కేంద్రం
అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులు
అంగన్‌వాడీలకు వేసవి సెలవులు ప్రకటించాలి. ఎండలు మండిపోతున్నాయి. చిన్నపిల్లలు, గర్భిణులు ఎండలకు అంగన్‌వాడీ కేంద్రాలకు రాకపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అంగన్‌వాడీలకు సంబంధించి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ప్రభుత్వం స్పందించాలి. – విజయ, అంగన్‌వాడీ టీచర్స్
అండ్ హెల్పర్స యూనియన్ జిల్లా నాయకురాలు.
ఎండలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. బయటకు రావాలంటే భయంగా ఉంది. ఇలాంటి సమయంలో అంగన్వాడీ కేంద్రాలు నడపడటం సరి కాదు. ప్రభుత్వం వెంటనే అంగన్‌వాడీలకు వేసవి సెలవులు ఇవ్వాలి. గర్భిణులు, బాలింతలకు ఇంటి వద్దే రేషన్ అందజేయాలి.
– హరిశర్మ, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు


