దేశవ్యాప్తంగా ఎగుమతి
మదనపల్లె: మదనపల్లె టమాట మార్కెట్‌కు మరోసారి కళ వచ్చింది. రైతుల చూపంతా ఇప్పుడు ఈ మార్కెట్‌పైనే ఉంది. దేశంలోనే అతిపెద్ద టమాట మార్కెట్‌గా ఇది ఖ్యాతిగాంచింది. రెండు నెలల క్రితం వరకు ఈ మార్కెట్లో 23 కిలోల క్రేట్ల ద్వారా విక్రయాలు జరగడంతో రైతులు కర్ణాటక మార్కెట్ల వైపు వెళ్లారు. ఇప్పుడు రైతులు కోరుకున్న విధంగా 15 కిలోల క్రేట్ల విధానం అమలు చేస్తుండడంతో కర్ణాటక మార్కెట్లపై ఆధారపడడం తగ్గించనున్నారు. సాధారణంగా ఏప్రిల్ నెల నుంచి జూలై నెలాఖరు వరకు టమాట సీజన్ నడుస్తుంది. ఇక్కడ నుంచి దేశవ్యాప్తంగా టమాట ఎగుమతి అవుతుంది.
గత సీజన్‌లో 1.06 లక్షల టన్నులు
మదనపల్లె టమాట మార్కెట్ నుంచి గత ఏడాది సీజన్లో లక్ష టన్నుల టమాట విక్రయం జరిగింది. గతేడాది ఏప్రిల్ లో 7,814 టన్నులు, మేలో 29,408 టన్నులు, జూన్ లో 45,527 టన్నులు, జూలైలో 23,764 టన్నుల టమాట విక్రయానికి మార్కెట్ కు వచ్చింది. గత సీజన్ లో మొత్తం 1,06,513 టన్నుల టమాట వచ్చింది. ప్రస్తుత సీజన్ లో ఈ స్థాయికి మించి టమాట వస్తుందని అంచనా వేస్తున్నారు.
15 కిలోల క్రేట్లతో మొగ్గు
కొన్నేళ్ల క్రితం వరకు తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాలు, పీలేరు, పుంగనూరు నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలకు చెందిన రైతులు టమాటను మదనపల్లె మార్కెట్ కు తరలించి విక్రయించుకునేవారు. తర్వాత కొన్ని ప్రాంతాల్లో మార్కెట్లో ఏర్పాటు కావడంతో ఇక్కడికొచ్చే టమాట కొంతమేర తగ్గింది. దానికి తోడు కర్ణాటకలోని వడ్డిపల్లి, కోలార్, చింతామణి మార్కెట్లలో వ్యాపారులు 15 కిలోల క్రేట్లతో టమాట వ్యాపారం జరపడంతో రైతులు అక్కడికి ఆకర్షితులయ్యారు. మన ప్రాంతంలోని మార్కెట్ల కంటే అక్కడ ఎక్కువ ధర ఉండటం, కమిషన్ తక్కువ కావడంతో పాటు 15 కిలోల క్రేట్లతో లాభాలు వస్తుండడంతో మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లోని సరిహద్దు ప్రాంతాల రైతులు కర్ణాటకకు తరలించి విక్రయించుకుంటున్నారు. ఇటీవల మదనపల్లి మార్కెట్లోనూ 15 కిలోల క్రేట్లతో టమాట విక్రయాలు సాగుతుండడంతో రైతులు ఇటువైపుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని మార్కెట్ల మాదిరి ఇక్కడ కూడా ఒకే రకమైన ధరలు పలికే అవకాశం ఉంటుంది. ములకలచెరువు మార్కెట్ యార్డులో ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా ఇప్పటికి 23 కిలోల క్రేట్ల విధానం అమలు చేస్తుండటంతో రైతులు దీన్ని వ్యతిరేకిస్తున్నా అధికారులు మాత్రం వ్యాపారులకే సహకరిండడం గమనార్హం.
ముందస్తు చర్యలు
మదనపల్లె మార్కెట్‌కు సీజన్‌లో భారీ స్థాయిలో టమాట విక్రయానికి వస్తుంది. వందల సంఖ్యలో రవాణా వాహనాలు వస్తాయి. మార్కెట్లోకి వచ్చి తిరిగి వెళ్లడానికి గంటల తరబడి సమయం పడుతుంది. మార్కెట్ నుంచి రింగ్ రోడ్డు, టిప్పు సుల్తాన్ మైదానం వరకు రవాణా వాహనాలు నిలిచిపోయి ఉంటాయి. దీనికి ట్రాఫిక్ సమస్యతో పాటు యార్డులో టమోటా నిల్వ, గ్రేడింగ్, లోడింగ్‌పై సమస్యలు వస్తాయి. ప్రస్తుతం 15 కిలోల క్రేట్లు కావడంతో కొంతమేర సమస్య తీరింది. ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాం, కార్యదర్శి జగదీష్, సహాయ కార్యదర్శి అభిలాష్ రెడ్డి సమీక్షలు జరిపి ప్రణాళికబద్ధమైన చర్యలు సిద్ధం చేశారు.
గత సీజన్లలో మదనపల్లెకు వచ్చిన టమాట (టన్నుల్లో)
మదనపల్లె మార్కెట్ నుంచి ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా టమాట దిగుమతి అవుతుంది. ప్రతిరోజు వేల టన్నుల టమాట రాష్ట్రాలకు వెళుతుంది. ఇందులో అత్యధికంగా తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీ, ఛత్తీస్‌ఘడ్‌లకు టమాట ఎగుమతి అవుతుంది. వీటితోపాటు ఒడిస్సా, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, కేరళం, పాండిచ్చేరిలకు ఎగుమతి అవుతుంది. ఈ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఇక్కడికి వచ్చి టమాట కొనుగోలు చేస్తుంటారు. దాంతో పోటీ అధికంగా ఉండి ధరలు పెరుగుతాయి. రైతులకు ప్రయోజం కలుగుతుంది.
2023 2024 2025
ఏప్రిల్ : 7,875 ఏప్రిల్ : 5,029 ఏప్రిల్ : 7,814
మే : 17,826 మే : 14,980 మే : 29,408
జూన్ : 29,954 జూన్ : 21,567 జూన్ : 45,527
జూలై : 13,158 జూలై : 34,423 జూలై : 23,764
రైతుల చూపు మదనపల్లె వైపు
గత సీజన్‌లో మార్కెట్‌కు 1.06 లక్షల టన్నుల టమాట రాక
ఇప్పుడు 15 కిలోల క్రేట్ల అమలుతోరైతుల్లో మరింత మొగ్గు
కర్ణాటక మార్కెట్లకు తగ్గనున్న వైనం


