బి.కొత్తకోట: మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ మంగళవారం నిర్మానుష్యంగా మారింది. ఎండలు విపరీతం కావడంతోపాటు కొండపై అధిక వేడి ఉండటం, చల్లదనం లేకపోవడంతో సందర్శకులు ఏసీ గదులను బుక్ చేసుకోవాల్సి వస్తోంది. దాంతోపాటు మైదాన ప్రాంతాల్లో ఉంటున్న ఎండలే కొండపైనా ఉండటంతో అక్కడికి వెళ్లినా అంతే అన్న భావనతో సందర్శకుల రాక తగ్గిపోయింది. ఫలితంగా కొండపై గదులు ఖాళీగా ఉండగా, సాధారణ సందర్శకులు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు. కొండపై పర్యాటకుల సంచారం లేక బోసిపోతోంది. మంగళవారం కూడా కొండపై 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
తంబళ్లపల్లె: వీబీజీ రామ్‌జీ పథకంలో భాగంగా చేపట్టిన జలశక్తి అభియాన్ జేఎస్‌జేబీ 2.0 పనులను సెంట్రల్ నోడల్ ఆఫీసర్ అనిల్‌కుమార్ మంగళవారం తనిఖీ చేశారు. జిల్లాలో 33 వేల పనులను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయగా.. అందులో పెద్దమండ్యం మండలంలో 12 పనులు, తంబళ్లపల్లె మండలంలో 7 పనులను ఆయన రేణుమాకులపల్లె పంచాయతీలో పర్యటించి పరిశీలించారు. కార్యక్రమంలో ఉపాధి ఇంజినీర్లు నాగరాజు, మహేష్, మండల టెక్నికల్ అసిస్టెంట్లు బావాజీ, పుష్ప, బాలగంగాధర్, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
పులిచెర్ల (కల్లూరు): ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందిస్తున్నామని, అలాగే పిల్లలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చిత్తూరు జిల్లా విద్యాశాఖాధికారి రాజేంద్రప్రసాద్ తెలిపారు. మండలంలోని కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం బడి పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరుగురు విద్యార్థులను చేర్చుకొని అక్కడికక్కడే అడ్మిషన్లు ఇచ్చారు. అనంతరం గ్రామంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు సిద్దరామయ్య, పోకల తాతయ్య, హెచ్‌ఎం శ్రీవాణి, స్కూల్ కమిటీ చైర్మన్ అస్రూఫ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా మంగళవారం పోలీసులు వాహనాల తనిఖీ విస్తృతంగా చేపట్టారు. ఈ తనిఖీలు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రధాన కూడళ్లు, అంతర్రాష్ట్ర సరిహద్దులు, సమస్యాత్మక ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. రికార్డులు లేని వాహనదారులకు 191 మందికి జరిమానాలు విధించారు.
రాయచోటి: రాయచోటి పట్టణం ఠానా సర్కిల్ వద్ద ఆర్టీసీ బస్సుకు బ్రేక్ ఫెయిల్ కావడంతో ముందు ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ సమయంలో రాజంపేట వైపు వెళ్తున్న ఇన్నోవా వాహనాన్ని ఢీకొంది. మంగళవారం ఉదయం పట్టణంలో రద్దీగా ఉన్న ఠానా వద్ద చేటుచేసుకున్న ఈ సంఘటన.. అక్కడున్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. ఆర్టీసీ బస్టాండ్ నుంచి డిపోకి వెళ్తున్న బస్సు ఠానా సర్కిల్ నుంచి సుండుపల్లి రోడ్డు వైపు తిరగగానే బ్రేక్ ఫెయిల్ అయినట్లు డ్రైవర్ గమనించి కేకలు వేశారు. నిత్యం రద్దీగా ఉండే సర్కిల్‌లో డ్రైవర్ అరుపులు విని పక్కకు పరుగులు తీశారు. కానీ ముందు వెళ్తున్న ఇన్నోవా వాహనాన్ని మాత్రం తప్పించలేకపోయాడు. ఈ ప్రమాదంలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. వాహనంలో ఉన్న వారికి ఎలాంటి గాయాలు తగలకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.


