మదనపల్లె: హంద్రీ–నీవా ప్రాజెక్టు పుంగనూరు ఉప కాలువలో కాంక్రీట్ లైనింగ్ పేరుతో ప్రభుత్వం నిధుల దోపిడీకి పాల్పడిందని వైఎస్సార్‌సీపీ మదనపల్లె సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం శాశ్వత తాగు, సాగునీటి కష్టాలను తీర్చేందుకు గత ప్రభుత్వంలో రూ.2 వేల కోట్లతో కాలువ వెడల్పు పనులు ప్రారంభిస్తే.. వాటిని కూటమి ప్రభుత్వం రాగానే రద్దు చేసి రైతులకు తీరని ద్రోహం చేసిందన్నారు. నిధులను దండుకునేందుకు చేపట్టిన కాంక్రీట్ లైనింగ్ పనుల్లో ఏమాత్రం నాణ్యత లేదని తేలిపోయిందన్నారు. లైనింగ్ పనులు, నీటి ప్రాజెక్టులు కూటమి నాయకులకు నిధుల దోపిడీకి అక్షయపాత్రలా మారిపోయాయని అన్నారు. కాంట్రాక్టర్ల చేతివాటానికి కూటమి నాయకులు అండగా ఉన్నారని అన్నారు. ప్రాజెక్టుల ద్వారా వచ్చిన అవినీతి సొమ్మును పంచుకుంటున్నారని ఆరోపించారు. కాలువకు గట్లు బలోపేతం చేయకుండా, సైడ్ స్లోప్ సరిచేయకుండానే నాసిరకం పద్ధతిలో కాంప్యాక్షన్ పూర్తి చేశారని, నిబంధనల ప్రకారం ఉండాల్సిన మందం లేకుండా లైనింగ్ పూర్తి చేయడం వల్ల నీటి ప్రవాహాన్ని గట్లు తట్టుకోలేకపోతున్నాయని అన్నారు. స్టీల్ ఫైబర్ రీన్‌ఫోర్స్‌డ్ కాంక్రీట్ పద్ధతిలో చేసిన లైనింగ్, నీటి ఉధృతికి చాలా చోట్ల పగుళ్లు ఇచ్చి ఊడిపోతోందని, ఇది అధికార యంత్రాంగం తప్పిదమా లేక పాలకుల తప్పిదమో నిగ్గు తేల్చాలని లేకుంటే ఉద్యమిస్తామని అన్నారు.
హంద్రీ–నీవా ప్రాజెక్టులోపారింది అవినీతి
వైఎస్సార్‌సీపీ నేత నిసార్ అహ్మద్


