● ప్రజలు మేల్కోకపోతే భావితరాలకు
పేదరికమే శాపం
● 200 ఏళ్లు వచ్చినా
రాజధాని నిర్మాణం పూర్తి కాదు
● మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి
ప్రొద్దుటూరు రూరల్ : రాజధాని నిర్మాణం పేరుతో కూటమి నేతలు రూ.లక్షల కోట్ల దోపిడీ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని తన క్యాంప్ కార్యాలయంలో రాచమల్లు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజధాని పేరుతో కూటమి నేతలు చేసే అన్యాయం, అక్రమాలు, అవినీతిని ప్రజలు గుర్తించలేకపోతే భవిష్యత్తు తరాలకు పేదరికాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో దేవతల రాజధానిని నిర్మిస్తున్నానని 2014లో మొదలు పెట్టి భూ దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. 50 వేల ఎకరాలు రాజధాని నిర్మాణానికి కావాలని ఏడాదికి మూడు బంగారు పంటలు పండించే భూములను రైతుల వద్ద నుండి బలవంతంగా లాక్కున్నారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజధాని నిర్మాణం అనుమానాస్పదంగా ఉందన్నారు. ఈప్రాజెక్టుపై అందరికి అనేక రకాలైన ప్రశ్నలు ఉన్నాయన్నారు. రాజధాని నిర్మాణం పూర్తి కావాలంటే 200 సంవత్సరాలు పట్టేటట్లు ఉందన్నారు. రాజధాని నిర్మాణం సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని చెప్పి రూ.47వేల కోట్లు రాజధాని నిర్మాణం కోసం అప్పు చేశారన్నారు. భవన నిర్మాణం చదరపు అడుగుకు రూ.4వేలు ఉండగా అదే చదరపు అడుగుకు రాజధాని నిర్మాణంలో రూ.14వేలు ఖర్చు చేస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ కరోనాలాంటి ఇబ్బందికర పరిస్థితిల్లో ఇంతగా అప్పు చేయలేదన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం 22 నెలల్లో రూ.3.41 లక్షల కోట్లు అప్పులు చేయడం దారుణం అన్నారు. ప్రజల పేరుతో ప్రతి మంగళవారం అప్పు చేసి ప్రతి శనివారం కూటమి నేతలైన చంద్రబాబు, లోకేష్, పవన్‌కళ్యాణ్ హైదరాబాద్‌కు డబ్బును తరలిస్తున్నారన్నారు. అమరావతిలో నిర్మించే రాజధాని భేతాళ కథలతో సమానమేనని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఉన్నన్ని రోజులు రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయలేరన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అనేక అక్రమాలు, అవినీతికి, ముఖ్యమంత్రి చెబుతున్న అబద్దాలకు, చేస్తున్న పనులకు పొంతనే లేకుండా పోయిందన్నారు. ఆర్థిక విధ్వంసం, ఆర్థిక అవినీతి, అన్యాయాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయన్నారు. 2014 నుండి చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణంపై ఒకటే స్లోగన్ వాడుతున్నారన్నారు. దేవతల రాజధానిని నిర్మిస్తా.. ఏ సింగపూర్.. దుబాయ్, అమెరికాను తలపించేలా అమరేంద్రుని స్వర్గసీమను తలపించేలా రాజధాని నిర్మాణాన్ని చేపడుతున్నట్లు చెబుతూనే ఉన్నాడు. వందల ఎకరాల్లో నిర్మించాల్సిన రాజధానికి 50వేలు ఎకరాలు కావాలని రైతుల వద్ద నుండి బలవంతంగా లాక్కోవడం దరుణమన్నారు. రాజధాని నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పే మాటలు కలలో అద్భుతంగా ఉంటాయని, మెలకువ రాగానే కంపచెట్లు, నీళ్లు తోడుకోవడం ఉంటుందన్నారు. రైతులను, నిరుద్యోగులను, ఇతర వర్గాల వారిని ఉద్దరిస్తానని చెప్పి రూ.లక్షల కోట్లు అప్పు చేస్తూ అందరికి పంగనామాలు పెడుతున్నారన్నారు. రాజధాని నిర్మాణం కూటమి నేతలకు ఏటీఎం లాంటిదన్నారు. ఈ ప్రభుత్వంలో ఉద్యోగ కల్పన ఉండదు, ఉపాధి అవకాశాలు ఉండవు, వ్యవసాయం నాశనం, ఆరోగ్యశ్రీ అటకెక్కిందన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా జగన్ చేశారంటూ ప్రజలకు ఒక భూతంలా చూపించారన్నారు.
బీఆర్ నాయుడును తొలగించాలని
నేడు పూజలు
టీటీడీ చైర్మన్ పదవి నుండి బీఆర్ నాయుడును తొలగించాలని కోరుతూ స్థానిక బొల్లవరంలోని వెంకటేశ్వరస్వామి దేవాలయంలో శనివారం ఉదయం 9.30 గంటలకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. పూజలు అనంతరం మీడియా సమావేశం ఉంటుందన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ, వార్డులలో ఉన్న పార్టీకమిటీ సభ్యులు ప్రత్యేక పూజల్లో పాల్గొనాలని ఆయన కోరారు.


