చిన్న పిల్లలపై పిచ్చికుక్క దాడి | - | Sakshi
Sakshi News home page

చిన్న పిల్లలపై పిచ్చికుక్క దాడి

Apr 3 2026 7:26 AM | Updated on Apr 3 2026 7:26 AM

మదనపల్లె టౌన్‌: మదనపల్లెలో ఓ పిచ్చి కుక్క చిన్నపిల్లపై దాడి చేసి తీవ్రంగా గాయ పరచింది. గురువారం సాయంత్రం చోటు చేసుకున్న ఘటనపై బాధితుల తల్లి దండ్రులు తెలిపిన వివరాలు.. మండలంలోని కోళ్ల బైలు గ్రామం, బాబు కాలనీలోకి ఎక్కడి నుంచో ఒక పిచ్చి కుక్క సాయంత్రం వచ్చింది. ఇంటి ముందు పిల్లలు ఆడుకుంటూ ఉండగా ఒక్కసారిగా దాడి చేసి పలువురు పిల్లలను కరచింది. స్థానికులు గమనించి కుక్కను చంపడానికి ప్రయత్నాలు చేసినా దొరక కుండా పారి పోవడంతో ఫలితం లేకుండా పోయింది. దీంతో చేసేది లేక పిల్లలను తల్లిదండ్రులు వెంటనే స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి చికిత్స అందించారు. వీరంగం చేసిన పిచ్చి కుక్క మళ్లీ ఎక్కడ వస్తుందోనని కాలనీ ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆలయంలో చోరీ

పెద్దతిప్పసముద్రం: మండలంలోని టి.సదుం సమీపంలో పాపాఘ్ని నది ఒడ్డున వెలసిన శ్రీ పార్వతీ సమేత సంఘమేశ్వర స్వామి ఆలయంలో బుధవారం రాత్రి చోరి జరిగింది. గుర్తు తెలియని దొంగలు ఆలయ ముఖద్వార తాళాలను పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ఆలయంలో ఉన్న పురాతన కాలం నాటి మూడు గంటలను, హారతి పళ్లెం,, దీపహారతిలను అపహరించుకెళ్లారు. గురువారం విషయం తెలుసుకున్న ఆలయ కమిటీ నిర్వాహకులు అక్కడకు వెళ్లి చోరీ విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు.

పెళ్లయిన ఐదు నెలలకే యువతి ఆత్మహత్యాయత్నం

మదనపల్లెటౌన్‌: పెళ్లై ఐదు నెలలు కూడా కాకముందే ఓ యువతి విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. మదనపల్లెలో గురువారం వెలుగు చూసిన ఘటనపై పోలీసుల కథనం.. మదనపల్లె పట్టణం, పుంగనూరు రోడ్డులోని బసినికొండలో కాపురం ఉంటున్న వినోద్‌ భార్య హరిత (22), భర్తతో తగవులాడి ఆవేశానికి లోనైంది. ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. కుటుంబీకులు గమనించి బాధితురాలిని స్థానిక జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి ఆమెకు మెరుగైన వైద్య చికిత్సలు అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటూ ఉంది.

శునకాల దాడిలో ఆవు మృతి

రామసముద్రం: రామసముద్రం మండలం పెద్ద కురపల్లి గ్రామంలో శునకాల దాడిలో పాడి ఆవు మృతి చెందింది. గ్రామానికి చెందిన గౌనివారి సుబ్రహ్మణ్యంకు చెందిన పాడి ఆవును పొలం వద్ద మేత కోసం కట్టేశారు. ఈ నేపథ్యంలో మేత మేస్తున్న పాడి ఆవుపై శునకాల గుంపు దాడి చేశాయి. తీవ్రగాయాలతో ఆవు మృతిచెందినట్లు రైతు తెలిపారు. మృతి చెందిన పాడి ఆవు సుమారు రూ.50వేల ఉంటుందని రైతు వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

రైలు కిందపడి

వృద్ధుడు అత్మహత్య

కొండాపురం: మండల పరిధిలోని రేగడిపల్లె–కొండాపురం రైల్వేస్టేషన్ల మధ్య రైలు కిందపడి చిన్నుగాల గోపాల్‌(68) ఆత్మహత్య చేసుకొన్నట్లు ఎర్రగుంట్ల రైల్వే ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి గురువారం తెలిపారు. ఈఘటన పై విచారించగా మృతుడు అప్పులు ఎక్కువ చేశాడని, తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ చెప్పారు. మృతదేహాన్ని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

అరటి తోట దగ్ధం

లింగాల : మండల కేంద్రమైన లింగాలలోని బాలశేఖరరెడ్డి అనే రైతు పొలంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించింది. అరటి తోటలోని ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి నిప్పు రవ్వలు తోటలో పడటంతో గెలలతో ఉన్న అరటి తోట అగ్నికి ఆహుతైంది. డ్రిప్‌ పరికరాలు, పీవీసీ పైపులు కాలిపోవడంతో సుమారు రూ.50వేల దాకా నష్టం వాటిల్లిందని రైతు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement