మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లాలో సంచలనం రేకెత్తించిన మణప్పురం రితు జువెలరీస్ మోసాలపై పోలీస్ యంత్రాంగం స్పందించింది. ‘సాక్షి’లో మదనపల్లె మణప్పురం రితు జువెలరీస్ మోసాలపై, వరుస కథనాలు ప్రచురితం కావడంతో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సీరియస్ అయ్యారు. ఎస్పీ ఆదేశాలతో స్థానిక వన్ టౌన్ సీఐ రాజారెడ్డి మణప్పురం రితు జువెలరీస్ మేనేజర్ సూరజ్‌పై చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీఐ గురువారం మాట్లాడుతూ.. మదనపల్లె ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉంటున్న మణప్పురం రితు జువెలరీస్ సంస్థలో ప్రజలు తరుగు, కూలి లేకుండా తక్కువ ధరకే బంగారం ఇస్తామని ఆ సంస్థ సిబ్బందితో పాటు మేనేజర్ సూరజ్ చీటీలు కట్టించుకున్నారు. ఆ డబ్బులు సంస్థలో జమ చేయకుండా సూరజ్ తన సొంత ఖాతాలకు మల్లించుకుని ఇటు ఖాతాదారులు, ప్రజలతో పాటు సంస్థను భారీగా మోసం చేయడం పాఠకులకు విధితమే. మణప్పురం రితు జువెలరీస్ మోసాల గుట్టును పట్టణానికి చెందిన డాక్టర్ లతశ్రీ గత నెల 30 రాత్రి బయట పెట్టారు. తాను సుమారు ఏడు లక్షలు మణప్పురం రితు జువెలరీస్‌లో రెండు వేర్వేరు చీటీల రూపంలో డబ్బు కట్టి మోసం పోవడాన్ని మీడియా సమావేశంలో బయట పెట్టడం తెలసిందే. ఈమెతో పాటు పట్టణ, రూరల్, జిల్లా పరిధిలోని ప్రజలు పెద్ద ఎత్తున బంగారం కోసం డబ్బు చీటీల రూపంలో కట్టి రూ. కోట్లల్లో మోసపోయినట్లు వరుసగా బాధితులు ఆరోపణలు చేశారు. మదనపల్లె మణప్పురం రితు జువెలరీస్ మోసాలపై బాధితులు గగ్గోలు పెట్టడంతో అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి స్పందించారు. మణప్పురం మోసాలపై సిఐ రాజారెడ్డిని ఆదేశించడంతో సిఐ, ఎస్‌ఐ లు సమస్థ మోసాలపై రెండు రోజుల పాటు విచారణ చేపట్టినట్లు తెలిపారు. అనంతరం అదే సమస్థలో పనిచేస్తున్న విష్ణుసోమసుందర్ ఫిర్యాదుతో గతంలో మదనపల్లె మణప్పురం రితు జువెలరీస్‌లో పనిచేసిన కేరళకు చెందిన మేనేజర్ సూరజ్‌పై ఛీటింగ్ ఇతర సెక్షన్లపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


