లక్కిరెడ్డిపల్లి: ఉపాధిహామీ పనుల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డ్వామా పీడీ వెంకటరత్నం పేర్కొన్నారు. గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో సామాజిక తనిఖీ గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా 2025–మార్చి 1వ తేది నుంచి 2026, జనవరి 31వ సంవత్సరానికి సంబంధించి ఉపాధిహామీ పథకం కింద రూ. 13 కోట్ల, 51 లక్షల, 5వేల, 488లు మంజూరైందని, ఈ మొత్తం నిధులు 1188 పనులకు ఖర్చు పెట్టినట్లు సామాజిక తనిఖీ సమావేశంలో వెల్లడించారు. పంచాయతీరాజ్ కింద రూ. 13 కోట్ల, 39 లక్షల, 3 వేల, 502 మంజూరు కాగా దీంతో సిమెంట్ రోడ్లు పనులు చేపట్టారు. అయితే ఈ పనులకు గాను కొన్ని గ్రామాలలో అక్రమాలకు పాల్పడ్డారని సామాజిక తనిఖీలో బయటపడటంతో రూ. 1 లక్ష, 56 వేల, 582లు రికవరీ చేసినట్లు ఉపాధి సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక నుంచి అక్రమాలకు చోటు లేకుండా కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ జి రాంజీ పథకం ప్రవేశపెట్టిందని ఈ పథకంలో ఎలాంటి అక్రమాలు జరగవని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ మధుబాబు, డిప్యూటీ ఎంపీడీఓ ప్రసాద్ బాబు, ఎస్‌ఆర్‌కె సూర్య, చక్రం, డిఆర్పీలు, టీఏలు, ఎస్‌ఏలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


