మదనపల్లె టౌన్: బి.కొత్తకోట మండలానికి చెందిన యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం వెలుగు చూసిన ఈ విషాదకర ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని మొగసాల మర్రికి చెందిన సుబ్బారెడ్డి కొడుకు శ్యాంరెడ్డి(23) బీటెక్ వరకు చదువుకుని ఉద్యోగ వేటలో ఉన్నాడు. ఎందుకు చిన్న మనసు చేసుకున్నాడో ఏమో తెలియదు. తాను ఉంటున్న ఇంటిలోనే తాడుతో ఉరి వేసుకున్నాడు. తల్లిదండ్రు గమనించి వెంటనే ఉరి నుంచి తప్పించారు. కొన ఊపితో ఉన్న కుమారుడిని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి, చికిత్స అందించేలోపే శ్యాంరెడ్డి మరణించాడు. జిల్లా ఆస్పత్రి ఔట్ పోస్టు పోలీసులు బి.కొత్తకోట పోలీసులకు సమాచారం అందించడంతో వారు కేసు దర్యాప్తు చేపట్టారు. శ్యాం రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది. బీటెక్ చదివిన బిడ్డ తమను ఉద్దరిస్తాడు అనుకునేలోపే దేవుడు ఇలా మాకు దూరం చేసి కడుపుకోత మిగిల్చాడని తల్లి దండ్రులు గుండెలవిసేలా విలపించారు. వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు.
నీలగిరి తోటకు నిప్పు
– తప్పిన ప్రమాదం
మదనపల్లె టౌన్: నీలగిరి తోటలో వ్యాపిస్తున్న మంటలను అగ్ని మాపక అధికారులు సకాలంలో అదుపు చేయడంతో తృటిలో ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం మదనపల్లె మండలంలో వెలుగు చూసిన ఘటనపై అగ్నిమాపక అధికారి శివప్ప తెలిపిన వివరాలు.. మండలంలోని వలసపల్లె గ్రామం, 150వ మైలు రాయి సమీపంలో ఉన్న ఓ నీలగిరి తోటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. తోటలో మంటలు వ్యాపించడం గమనించిన పక్కనే ఉన్న పెట్రోల్ బంకు సిబ్బంది స్థానిక అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. స్పందించిన అగ్నిమాపక అధికారి శివప్ప తన సిబ్బందితో వెళ్లి నీలగిరి తోటలో మంటలను అదుపుచేశారు. సకాలంలో అగ్ని మాపక అధికారులు స్పందించక పోయి ఉంటే మంటలు పెట్రోల్ బంకు వద్దకు వచ్చి ఉండేవనీ.. భారీ ప్రమాదం జరిగేదని అధికారులు ఆందోళన చెందారు. సకాలంలో మంటలు అదుపు చేయడంతో స్థానికులు, పెట్రోల్ బంకు సిబ్బంది సంతోషం వ్యక్తంచేశారు.


