బి.కొత్తకోట: కూటమి పాలనలో పేదల ఆరోగ్యం గాలిలో దీపంగా మారిందని సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశం విమర్శించింది. బుధవారం బి.కొత్తకోటలో ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వివిధ అంశాలపై కమిటీ చర్చించింది. రూ.3వేల కోట్ల బకాయిల కారణంగా ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించాక కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిందని నాయకులు విమర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందన్నారు. ఆస్పత్రులలో జీతాలు లేక మందుల కొరతతో వైద్యం అందించలేని పరిస్థితి నెలకొందన్నారు. క్రైస్తవ మతం స్వీకరించిన దళితులకు ఎస్సీ రిజర్వేషన్లు రద్దు చేయాలన్న నిర్ణయం తగదన్నారు. మతం మారినా కుల వివక్ష మారదని, దళిత క్రైస్తవులు ఇప్పటికీ సామాజికంగా అదే వివక్షను ఎదుర్కొంటున్నారని తెలిపారు ఎస్సీ రిజర్వేషన్లు తొలగిస్తే దళిత క్రైస్తవులు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వెనుకబడతారన్నారు. సమాజంలో కులవివక్ష కొనసాగుతున్న పరిస్థితుల్లో మతాన్ని ఆధారంగా చేసుకుని రిజర్వేషన్లు నిరాకరించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ఎస్సీ హక్కులు కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మహేష్,సహయ కార్యదర్శి తోపు కృష్ణప్ప, జిల్లా కార్యవర్గ సభ్యులు మనోహర్ రెడ్డి, సాంబశివ, మురళి, సిద్దిగాళ్ల శ్రీనివాసులు, సుమిత్రమ్మ తదితరులు పాల్గొన్నారు.


