కలకడ : మండలంలోని కదిరాయచెర్వులో గ్రామ దేవత శ్రీచౌడేశ్వరిదేవి ఉత్సవాలు ఘనంగా జరగుతున్నాయి. ఆదివారం అమ్మవారు సింహవాహనంపై గ్రామ పురవీధుల్లో ఊరేగుతూ ఇంటింటి పూజలు అందుకున్నారు. ఆదివారం రాత్రి నిర్వహించిన జ్యోతి ఉత్సవాలు సోమవారం ఉదయం వరకు కొనసాగాయి. తొగటవీరక్షత్రియుల కుల దైవమైన శ్రీచౌడేశ్వరి దేవికి బోనం సమర్పించారు. కులమతాలకు అతీతంగా గ్రామస్తులు ప్రతి ఇంట మొక్కులు చెల్లించి, ప్రత్యేక పూజలు చేశారు.
మారీచ చలనచిత్రం
పోస్టర్ ఆవిష్కరణ
మదనపల్లె సిటీ : మదనపల్లె యువ కళాకారులు నటించిన మారీచ చలనచిత్రం పోస్టర్లను ఆదివారం స్థానిక కురవంకలో సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.మునిగోపాలకృష్ణ ఆవిష్కరించారు. చిత్ర నిర్మాత ప్రకాష్, డైరెక్టర్ శివాజీ మాట్లాడుతూ ఏప్రిల్ 5వ తేదీన ఆమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానున్నట్లు తెలిపారు. సందేశాత్మక విలువతో చిత్రం నిర్మించామన్నారు. కథానాయకుడు సంతోష్ మాట్లాడుతూ అందరూ ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో వీఏఎఫ్ ఫౌండర్ భానుప్రకాష్, సయ్యద్ అజామ్, మల్లీశ్వరి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
విద్యుదాఘాతంతో
ఎలక్ట్రీషియన్ మృతి
పీలేరురూరల్ : విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ మృతి చెందిన సంఘటన ఆదివారం పీలేరు పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పీలేరు పట్టణం బండ్లవంకకు చెందిన ఎస్. వంశీకృష్ణ (40) ఎలక్ట్రీషియన్ పని చేస్తూ జీవనం సాగించేవాడు. ఆదివారం స్థానిక తిరుపతి రోడ్డు మార్గంలో కల్యాణమండపం వద్ద మరమ్మతులు చేస్తూ విద్యుద్ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ యుగంధర్ తెలిపారు.


