కమనీయం.. సీతారాముల కల్యాణం | - | Sakshi
Sakshi News home page

కమనీయం.. సీతారాముల కల్యాణం

Mar 30 2026 8:31 AM | Updated on Mar 30 2026 8:31 AM

వాల్మీకిపురం : జిల్లాలో ప్రసిద్ధి చెందిన వాల్మీకిక్షేత్రం శ్రీ పట్టాభిరామస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఆదివారం రాత్రి 8నుంచి 10గంటల వరకు ఆశ్లేష నక్షత్రంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. వేకువజామున సుప్రభాతసేవతో స్వామివారిని మేల్కొలిపి మూలవర్లకు అభిషేకం, తోమాలసేవ, పంచాంగ శ్రవణం, కొలువు, అర్చన, మొదటి గంట, శాత్తుమొర, అనంతరం ఉదయం 8 నుంచి 9గంటల వరకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. అలాగే 10నుంచి 12గంటల వరకు స్నపన తిరుమంజనానికి విచ్చేసిన భక్తులు కార్యక్రమాన్ని తిలకించి తన్మయత్వం చెందారు. సాయంత్రం ఊంజల మండపంలో స్వామివారికి ఊంజల్‌ సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాత్రి 8నుంచి 10గంటల వరకు పట్టణ పరిధి తోటవీధిలోని టీటీడీ స్థలంలో సుందరంగా అలంకరించిన కల్యాణ వేదికపై వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కల్యాణ మహోత్సవం కనులపండువగా జరిగింది. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలను అందించారు. కల్యాణోత్సవానికి జిల్లాలోని పలు ప్రాంతాలనుంచి వేలాది మంది భక్తులు రావడంతో తోటవీధి కిక్కిరిసింది. ఆర్జిత కల్యాణోత్సవంలో పాల్గొన్న దంపతులకు నూతన వస్త్రం, ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఆలయ అధికారి క్రిష్ణమూర్తి, నాగరాజ, నగేష్‌, భక్తులు పాల్గొన్నారు.

గరుడవాహనంపై రఘురాముడి విహారం

వాల్మీకిపురం : వాల్మీకిక్షేత్రం శ్రీ పట్టాభిరామస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఆదివారం రాత్రి కల్యాణోత్సవ అనంతరం సీతారామలక్ష్మణలు గరుడవాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.. మహిళలు స్వామివారికి టెంకాయలు, కర్పూర నీరాజనాలతో స్వాగతం పలికారు. ఉభయదారులు నిర్వహించిన బాణా సంచాప్రదర్శన, సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను ఆకర్షించాయి.

నేడు రథోత్సవం

వాల్మీకిపురం : శ్రీ పట్టాభిరాముడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం 7గంటలకు రథారోహణం, 9:10 గంటలకు రథోత్సవం నిర్వహించనున్నారు. ఇందు కోసం రథాన్ని శుద్ధి చేసి, రంగురంగుల పుష్పాలు, మామిడి ఆకుల తోరణాలు, అరటి కొమ్మలతో అలంకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement