విచ్చలవిడిగా మద్యం దందా | - | Sakshi
Sakshi News home page

విచ్చలవిడిగా మద్యం దందా

Mar 30 2026 8:31 AM | Updated on Mar 30 2026 8:31 AM

రాయచోటిలో నిరంతరం మద్యం అమ్మకాలు

పట్టించుకోని అధికారులు

రాయచోటి : మందు బాబులకు న్యాయమైన మందును తక్కువ ధరకే విక్రయిస్తామని మాటలు చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మందుబాబుల రక్తాన్ని డబ్బు రూపంలో పీల్చుతున్నారు. రాయచోటి పట్టణంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్యం షాపుల్లోనే నిరంతరం మద్యం విక్రయాలు సాగుతున్నాయి. సాధారణంగా ఉదయం 10 నుంచి రాత్రి పది గంటల వరకు మద్యం దుకాణాల్లో మందును విక్రయించాల్సి ఉంది. రాయచోటి పట్టణంలో మాత్రం ప్రధాన షాపుల్లో తెల్లవారుజామున ఐదు గంటలకు వెళ్లినా ఒకడోరు తెరిచి మద్యాన్ని విక్రయించడం కనిపిస్తోంది. పట్టణ శివారుల్లో ఉన్న కూల్‌ డ్రింక్స్‌ షాపుల్లో సైతం మద్యం విక్రయాలు జరుగుతున్నాయంటే కూటమి ప్రభుత్వం ఏ రీతిలో మద్యం విక్రయాలను సాగిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఏ పల్లె, మారుమూల గ్రామానికి వెళ్లినా బెల్టు షాపులు లెక్కలేనన్ని కనిపిస్తాయి. గుడి, బడి, జనవాసాలు అన్న తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. మద్యం దుకాణాల యజమానులే అమ్మకాలను పెంచుకోవడానికి వీటిని నిర్వహిస్తున్నారని ప్రచారం ఉంది. ప్రతినెల మద్యం షాపులు, బార్లు, బెల్టు షాపుల నుంచి ముడుపులు ముడుతుండటంతో సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. నిబంధనల మేరకు విక్రయాలు చేయించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో మద్యం వ్యాపారుల దందా మూడు చీప్‌లు.. 30 లిక్కర్లుగా సాగుతోంది. సంసారాలు నాశనం అవుతున్నాయని మహిళలు రోడ్డెక్కి గగ్గోలు పెడుతున్నా అధికారులు మాత్రం పగలు, రాత్రి అన్న తేడా లేకుండా విక్రయిస్తున్న మద్యం షాపులు, బెల్టు షాపులపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ప్రభుత్వానికి లెక్కలు చూపడానికి ఒకటి రెండు కేసులు నమోదు చేయడం తప్పా సీజ్‌ చేసిన దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న వ్యాపారంపై, బెల్టుషాపులపై చర్యలు లేకపోవడం గమనార్హం. రాయచోటి పట్టణ పరిధిలో పది షాపులు.. మూడు బార్లు నడుస్తున్నాయి. ఇవి కాకుండా సమీప ప్రాంతాల్లోనే హోటల్‌ ప్రత్యేక గదుల్లో మద్యం తాపిస్తూ వారి నుంచి విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తున్నారు. బెల్టుషాపుల్లో చీప్‌ లిక్కర్‌పై రూ. 20లు.. మిగిలిన మద్యంపై రూ. 50 నుంచి రూ. 100ల వరకు అదనంగా వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. రాయచోటి పట్టణ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లోనే మద్యం, గంజాయి సేవించి సమీప ప్రాంత ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నా.. ఎకై ్సజ్‌, పోలీసుల చర్యలు కనిపించలేదు. రాయచోటిలోని మదనపల్లె, చిత్తూరు, గున్నికుంట్ల, సుండుపల్లి, గాలివీడు, వేంపల్లి, కడప, వీరబల్లి మార్గాల పరిధిలోని కూల్‌ డ్రింక్స్‌ షాపులలో సైతం మద్యం బాటిళ్లు విక్రయిస్తున్నారు. రింగ్‌ రోడ్డు పరిసర ప్రాంతాల్లోని ప్రధాన హోటళ్లలో సైతం ప్రత్యేక గదులు ఏర్పాటు చేయించి మద్యం తాపిస్తున్నా చర్యలు మాత్రం కనిపించలేదు. రాయచోటి పట్టణ పరిధిలో అనధికారికంగా మద్యం..అవే దుకాణాల్లో గంజాయి విక్రయాలు కూడా సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా ఎకై ్సజ్‌, పోలీసు శాఖలు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న మద్యం దుకాణాలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement