కిడ్నీ రాకెట్ కేసులో మరో నిందితుడు అరెస్ట్
మదనపల్లె టౌన్ : రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన మదనపల్లె కిడ్ని రాకెట్ కేసులో తప్పించుకు తిరుగుతున్న మరో నిందితున్ని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడి అరెస్టుకు సంబంధించి అన్నమయ్య జిల్లా మదనపల్లె డిఎస్పీ మహీంద్ర, టూటౌన్ ఎస్‌ఐ రహీముల్లా స్థానిక డిఎస్పీ కార్యాలయంలో అరెస్టు వివరాలను మీడియాకు వెళ్లడించారు. మదనపల్లె ఎస్‌బీఐ కాలనీలో ఉన్న గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్వాహకుడు, అప్పటి జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ ఆంజనేయులు, మదనపల్లె జిల్లా ఆస్పత్రి డయాలసిస్ కేంద్రం మేనేజర్ బాల రంగడు అలియాస్ బాలు, కదిరి ప్రభుత్వాసుపత్రి డయాలసిస్ మేనేజర్ మెహరాజ్‌లకు మధ్యవర్తిగా వ్యవహరించిన కృష్ణా జిల్లా కరప గ్రామానికి నార్ల వెంకటేశ్వర్లు (47)ను శనివారం అరెస్టు చేశారు. కాగా ఈ కేసులో ఇది వరకే బెంగుళూరుకు చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ పార్థసారథిరెడ్డి మరి కొంత మంది గత ఏడాది నవంబర్ 9న విశాఖపట్నం జిల్లా, బొడ్డి పాళ్యంకు చెందిన సాడి యమున(29) శరీరం నుంచి కిడ్నీని తొలగించారు. దీంతో ఆమె 10న మృతి చెందింది. మదనపల్లెలో కిడ్నీ రాకెట్ మూలాలు బయటకు రావడంతో ఈ కేసు రాష్ట వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. మృతురాలి తల్లి సూరమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో ఘటనపై డిఎస్పీ మహీంద్ర ఆదేశాల మేరకు స్థానిక టూటౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ రాజారెడ్డి, ఎస్‌ఐ రహీముల్లా పలువురిపై హత్య కేసు నమోదు చేశారు. మొదటి దఫాలో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా, రెండో దఫాలో నలుగురి నిందితులను అరెస్టుచేశారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న మొత్తం 22 మంది నిందితుల్లో పోలీసులు ఉప్పటి వరకు పది మంది నిందితులనే అరెస్టుచేశారు. ఇంకా 12 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేయాల్సి ఉన్నట్లు తెలసింది. కాగా ఈ కేసులో ప్రమేయం ఉన్న కృష్ణా జిల్లా, కరప గ్రామంకు చెందిన ఏ10 ముద్దాయి నార్ల వెంకటేశ్వర్లు (47)ను అరెస్టుచేశారు. ముద్దాయిలను పోలీసులు ఒకొక్కరినే అరెస్టు చేస్తూ వస్తుండడడంతో తీగ లాగితే డొంక కదిలినట్లుగా కిడ్నీ రాకెట్ కేసులో సూత్రధారులు, పాత్రధారులను గుర్తించి అరెస్టు చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.


