ఈ సారైనా నిధులిస్తారా!
జీఎన్‌ఎస్‌ఎస్‌కు రూ. 2,450 కోట్లు
కడప సిటీ: జిల్లాలోని సాగు,తాగునీటిప్రాజెక్టులపై ‘పచ్చ’నీడ కమ్ముకుంది. ‘పైసల్లేక..’ పనులు జరగడమే గగనమైంది. ఫలితంగా జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఎగనామం పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం జిల్లాలోని మిగతా ప్రాజెక్టుల ఉన్నతినీ గాలికొదిలేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబేమో ప్రతి సమావేశంలో రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరందిస్తామని డప్పు కొడతారు. వాస్తవ రూపం
లో అది అమలు కావడం లేదు.
● రాజంపేట పరిధిలో ఉన్న అన్నమయ్య ప్రాజెక్టు నిర్మాణం అతీగతీ లేకుండా పోయింది. కమిటీలతో కాలయాపన చేసి మళ్లీ కొత్త టెండరు పిలువడంగానీ లేదా అదే కాంట్రాక్టర్‌కు అప్పగించడంగానీ జరగడం లేదు. దీంతో ప్రాజెక్టు నిర్మాణం అగమ్యగోచరంగా మారింది. జిల్లాలోని ప్రాజెక్టులు శరవేగంగా కొనసాగాలంటే 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ. 3 వేల కోట్లకు పైగా నిధులు అవసరమని నీటిపారుదలశాఖ అధికారులు అంచనా వేశారు. ఈ నేపధ్యంలో జిల్లా ప్రాజెక్టుల సీఈ కార్యాలయం నుంచి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించే సమయం ఆసన్నమైంది. కనీసం అధికారులు పంపిన నివేదిక ప్రకారం నిధులను మంజూరు చేస్తారా? లేక ఎగనామం పెడతారా? అనేది వేచి చూడాల్సిందే. రాయలసీమ వాసిగా.. సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వట్టి మాటలు చెప్పడం ఆపి.. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేసి నీళ్లు ఇచ్చి సీమ గొంతు తడపాలని ప్రజలు కోరుతున్నారు.
అన్నమయ్య కావాలంటే
రూ.100 కోట్లు కావాలి
అన్నమయ్య ప్రాజెక్టు నిర్మాణం కోసం 2021 నవంబరులో అప్పటి వైఎస్‌ఆర్ సీపీ ప్రభుత్వం రూ. 787.77 కోట్లకు అనుమతులు ఇచ్చి టెండర్లను కూడా పిలిచింది. ఈ పనులను రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ దక్కించుకుంది. ఈ సంవత్సరం మార్చి చివరి నాటికి పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికీ సంబంధించిన డిజైన్‌పై ఆమోదం లభించకపోవడంతో ప్రాజెక్టుకు బీజం పడలేదు. కమిటీ నెపంతో నీటిపారుదల ఇంజనీరింగ్ శాఖ అధికారులు, సాంకేతిక నిపుణులు పరిశీలించి ప్రాజెక్టు పూర్తికి నిధులు అవసరమని తేల్చడం జరిగింది. 2021 నవంబరు 19న అన్నమయ్య ప్రాజెక్టు మట్టి కట్ట వరదకు గురైంది. స్పిల్‌వే 94 మీటర్లు దెబ్బతింది.
ఇతర ప్రాజెక్టులకు..
మైలవరం జలాశయానికి రూ. 1.60 కోట్లు, ఝరికోనకు రూ. 7 కోట్లు, వెలిగల్లుకు రూ.5.20 కోట్లు, బుగ్గవంక ప్రాజెక్టుకు రూ. 0.20 కోట్లు అవసరమని అధికారులు నివేదించారు. రూ.10 కోట్లు ప్రణాళికేతర పద్దు కింద అవసరమని అధికారులు కోరారు. ఈ నిధులు వస్తేగానీ ఈ పనులు ముందుకు సాగే అవకాశం కనిపించడం లేదు. అలాగే పులివెందుల నియోజకవర్గ ప్రాజెక్టు పనులకు రూ. 430 కోట్లు, దిగువ సగిలేరుకు రూ. 30 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపారు.
జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల పనులపై సర్కార్ నిర్లక్ష్యం
ప్రాజెక్టులకు రూ. 3 వేల కోట్లకు పైగా నిధులు అవసరం!
బడ్జెట్‌లో నిధుల కేటాయిస్తారా....ఎగనామం పెడతారా?
ఒకవైపు పోతిరెడ్డిపాడు పనులు సాగుతూనే ఉన్నా...అవుకు జలాశయం నుంచి గండికొట సొరంగం వరకు వరద కాలువ, సొరంగం పనులు వైఎస్సార్ సీపీ పాలనలో జరిగాయి. కూటమి హయాంలో సర్వరాయసాగర్, వామికొండ, జీఎన్‌ఎస్‌ఎస్ ఫేస్–2 ప్యాకేజీలు ఉండగా, 3–7 వరకు పనుల్లో పురోగతి లేదు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో సివిల్ పనులు, భూ సేకరణ, అధికారులు, సిబ్బంది వేతనాలు, పునరావాస కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు అవసరమని ప్రభుత్వానికి నివేదికలు అందజేశారు.
ప్రతిపాదనలు అందజేశాం
జిల్లాలోని ఆయా ప్రాజెక్టుల పెండింగ్ పనులకు దాదాపు రూ. 3 వేలకోట్లకు పైగా నిధులు అవసరమని ప్రభుత్వానికి నివేదికలు అందజేశాం. నిధులు మంజూరు కాగానే జిల్లాలోని ఆయా ప్రాజెక్టుల పెండింగ్ పనులకు సంబంధించి పనులను శరవేగంతో పూర్తి చేస్తాం. అన్నమయ్య ప్రాజెక్టు కూడా ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే నిర్మాణ పనులు చేపడతాం. –వరప్రసాద్,
ప్రాజెక్టుల సీఈ, కడప


