సమీక్షకే సమయం లేదా! | - | Sakshi
Sakshi News home page

సమీక్షకే సమయం లేదా!

Feb 13 2026 3:13 AM | Updated on Feb 13 2026 3:13 AM

సమీక్షకే సమయం లేదా!

సమీక్షకే సమయం లేదా!

● ఆహ్వాన పత్రాలేవీ..

ఉన్నతాధికారులెక్కడ!

ఒంటిమిట్ట: ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం వార్షిక బ్రహ్మోత్సవాల గడువు సమీపిస్తోంది. సరిగ్గా మరో 45 రోజుల్లో ఉత్సవాలకు శ్రీకారం జరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్త జనం తరలిరానుంది. పైగా రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో జరిగే బ్రహ్మోత్సవ వేడుక ఇది. ఇంతటి మహోత్సవంపై ఉన్నత స్థాయి అధికారులు ఇంతవరకు సన్నాహాక సమీక్షలు నిర్వహించక పోవడంపై భక్తులు నిట్టూర్చుతున్నారు. ఇది టీటీడీ అధికారుల నిర్లక్షాన్ని చూపుతోందని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆలయాల ఉత్సవాల్లో ముందస్తు చర్యల్లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంఘటనలు.. మృత్యువాత పడుతున్న ఘటనలను ఉటంకిస్తున్నారు.

● ఒంటిమిట్టలో శ్రీ కోదండ రామాలయం వార్షిక బ్రహ్మోత్సవాలను మార్చి 26న అంకురార్పణ చేయనున్నారు. ఏప్రిల్‌ 5వ తేది వరకు నిర్వహించాలని ఇప్పటికే అధికారికంగా అనుమతిచ్చారు. సరిగ్గా 42 రోజుల సమయం ఉంది. గతంలో ఏటా మూడు నెలల ముందు నుంచి బ్రహ్మోత్సవాలు వచ్చే వరకు నెలకోసారి సమీక్ష సమావేశం నిర్వహించే వారు. ఈ ఏడాది ఇంతవరకు ఉన్నతాధికారులతో ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదు. ఈపాటికి కల్యాణ వేదిక వద్ద బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు మొదలయ్యేవి. సీతారాముల కళ్యాణ వేదిక ప్రాంగణంలో కంపచెట్లు, కలుపు మొక్కలు తొలగించి, చదును చేసేందుకు గుత్తపత్రాలు ఆహ్వానించినా, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఇక్కడ ఇంకా ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. మొక్కలను తొలగించి చదును చేయాల్సి ఉంటుంది. వాహనాలను నిలిపేందుకు ప్రత్యేకంగా స్థలాన్ని ఎంపిక చేసి, అక్కడ శుభ్రం చేయాల్సి ఉన్నా కదలిక లేదు. విద్యుత్‌ నియంత్రికలు అమర్చాలి, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి, తాగునీరు, సేవకులకు భోజన వసతి, పట్టువస్త్రాలు, పుష్పమాలికలు, ఆభరణాలతో అలంకరణలు, విద్యుత్‌ కాంతులు, స్వాగత తోరణాలు ఏర్పాటు, ప్రసాదం పంపిణీ, పారిశుధ్యం, వైద్య సేవలు, క్యూలైన్లు వంటి అంశాలు చర్చకు రావాల్సి ఉంది. ఉత్సవాల వేల విధులు నిర్వహించే ఉద్యోగులు, సిబ్బంది, సేవకులకు బస వసతి కల్పించడంపై శ్రద్ధ వహించాల్సి ఉంది.

ఒంటిమిట్ట రామయ్య బ్రహ్మోత్సవ వేడుకల సమాచారాన్ని దశదిశలా తెలిపేలా విస్తృతంగా ప్రచారం చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 1న జరిగే సీతారాముల కల్యాణానికి తలంబ్రాలు అందజేసేందుకు చిరు సంచులు, రాములోరి పరిణయ ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ప్యాకెట్లలో తలంబ్రాలు నింపి అందిస్తామని అధికారులు చెబుతున్నారు. గోడపత్రాలు, ప్రముఖులకు ఆహ్వాన పుస్తకాలు(వీఐపీ, వీవీఐపీ), రంగుల కరపత్రాలు, ప్రత్యేక ఆహ్వానాలు పత్రాలు వేల సంఖ్యలో ముద్రించేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుందని చెబుతున్నా... గోడ, కర, ప్రచార పత్రాలు ఇంకా ఇక్కడికి చేరలేదు.

నెలన్నర రోజుల్లో ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు

గోడ, కర, ఆహ్వాన పత్రాల ఊసే లేదు?

కల్యాణ వేదిక ప్రాంగణమంతా పిచ్చిమొక్కలే

ఇదీ కోదండ రాముడి ఉత్సవ ఏర్పాట్ల తీరు

సాధారణంగా గత వేడుకల్లో జరిగిన తప్పిదాలను మరలా జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉన్నతాధికారులు సమీక్షించాల్సి ఉంది. సమీక్షలే చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారింది. ఏటా ఉత్సవాలు ప్రారంభమవడానికి ముడు నెలల ముందే ఒంటిమిట్టలో చేపట్టాల్సిన అభివద్ధి పనులు, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ, సమీక్ష నిర్వహిస్తూ వచ్చేవారు. లోటు పాట్లు లేకుండా ముందస్తుగా కసరత్తు చేసి, విజయవంతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, ఆ దిశగా అడుగులేసేవారు. ఈ దఫా ఎందుకనో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఇక్కడికి జేఈవో, ఈవో ఉన్నత స్థాయి అధికారులెవరూ రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement