ప్రైవేట్ పాఠశాలలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ అనూరాధ
మదనపల్లె సిటీ: విద్యా హక్కు చట్టం ప్రకారం 2026–27 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పించేందుకు జిల్లాలోని ప్రతి ప్రైవేట్,అన్ ఎయిడెడ్ పాఠశాలలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ అనూరాధ పేర్కొన్నారు. గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సమగ్రశిక్ష ఆధ్వర్యంలో పాఠశాలల విద్యా కమిషనర్ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ విధానం గురించి జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రక్రియ ఈనెల 16వతేదీలోపు పూర్తి చేయాలన్నారు. ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాల కోసం ఈనెల 20వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నందున ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. పాఠశాల గుర్తింపు సర్టిఫికెట్ ప్రతిని అప్‌లోడ్ చేయాలన్నారు. ఆర్‌టీఈ కింద గత నాలుగు సంవత్సరాల్లో ఎంత మంది విద్యార్థులు ప్రవేశం పొందారు ప్రస్తుతం ఎంత మంది చదువుతున్నారు అనే వివరాలు కూడా నమోదు చేయాలన్నారు. డిప్యూటీ ఎంపిడిఓ తిరుపాల్‌నాయక్, సమగ్ర శిక్ష సీఎంఓ, నోడల్ అధికారి కరుణాకర్, ఎంఈఓలు ప్రభాకర్‌రెడ్డి, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.


