సున్నా వడ్డీకి సున్నం!
వడ్డీ రాయితీకి ఎగనామం...
కడప అగ్రికల్చర్: వ్యవసాయానికి పెద్దపీట వేస్తాం...అన్నదాతలను ఆదుకుంటామంటూ ప్రగల్భాలు పలికిన కూటమి ప్రభుత్వం అధికారంలోని వచ్చిన తర్వాత రైతన్నలను అడుగడుగునా మోసం చేస్తూనే ఉంది. ఎన్నికలకు ముందు తీసుకున్న పంట రుణాలను సకాలంలో చెల్లించే రైతులకు ఇస్తున్న సున్నా వడ్డీ రాష్ట్ర ప్రభుత్వమే ఎసరు పెట్టింది. అంతేకాకుండా మోసపూరిత వాగ్దా నాలు చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మొదటి ఏడాదే అన్నదాత సుఖీభవ నిధులను(రైతు భరోసా) ఎగరగొట్టింది. అది చాలదన్నట్లు అధికారంలోకి వచ్చిన తరువాత దాదాపు 18 నెలల కాలంలో ఇప్పటి వరకు నయా పైసా కూడా వడ్డీ రాయితీ విడుదల చేయలేదు. ఫలితంగా ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో దాదాపు లక్షల మంది రైతులు నష్టపోయారు.
వైఎస్ జగన్ హయాంలో నిరాటంకంగా..
వడ్డీ రాయితీ పథకంలో భాగంగా రైతులు తీసుకున్న పంట రుణాలను సకాలంలో చెల్లిస్తే 4 శాతం వడ్డీ రాయితీ ప్రభుత్వం చెల్లించాలి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సకాలంలో రైతులకు వడ్డీ రాయితీ అందచేసింది. వ్యవసాయ అవసరాలకు కోసం రైతులు తీసుకున్న రుణాలకు పావలా వడ్డీని ప్రభుత్వమే భరించింది. ఐదేళ్లపాటు నిరాటంకంగా ఈ పథకాన్ని జగనన్న సర్కాలు అమలు చేసింది. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ సున్నా వడ్డీ పథకాన్ని పూర్తిగా విస్మరించింది.
ఉమ్మడి జిల్లాలో...
ఉమ్మడి జిల్లాలో 72 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్)లు ఉన్నాయి. ఈ సంఘాల్లో సుమారు 1,65,000 మంది సభ్యులున్నారు. వీరంతా కనిష్టంగా లక్ష నుంచి రూ.3 లక్షల వరకు వ్యవసాయ అవసరాల కోసం పంట రుణాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా 2024–25 సంవత్సరంలో ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో వ్యవసాయ పంట రుణాల కింద రైతులు సుమారు రూ. 530 కోట్లు తీసుకున్నారు. అలాగే 2025–26 సంవత్సరంలో కూడా 550 కోట్లు పంట రుణాల తీసుకున్నట్లు డీసీసీబీ అధికారులు తెలిపారు. వీరికి ప్రభుత్వం వడ్డీ రాయితీ ఇవ్వడం వల్ల రైతులకు కొంతమేర ఉపశమనం కలుగుతుంది. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఈ ధపా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు వడ్డీ రాయితీకి ఎగనామం పెట్టింది.
వెంటనే విడుదల చేయాలి
లక్ష రూపాయలలోపు రుణాలు తీసుకున్న రైతులందరికీ వడ్డీ రాయితీని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. ఇటీవల రుణాల కోసం బ్యాంకులకు వెళ్తున్న రైతులను ప్రభుత్వం వడ్డీ రాయితీ విడుదల చేయలేదని రుణాలపై వడ్డీని వసూలు చేస్తున్నారు. వెంటనే వడ్డీ రాయితీ బకాయిలు విడుదల చేసి రైతులను ఆదుకోవాలి.
– సంబటూరు ప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు
రుణాలు చెల్లించినా అందని వడ్డీ రాయితీ...
ఏటా పంట రుణాలను సక్రమంగా చెల్లిస్తున్నా వడ్డీ రాయితీ అందడం లేదు. రెడేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. బ్యాంకులు రుణాలిస్తున్నాయే తప్ప రాయితీ విషయం మాట్లాడటం లేదు. బ్యాంకు అధికారులు ఒత్తిడి తెస్తుండటంతో మరో గత్యంతరం లేక వడ్డీ కూడా చెల్లిస్తున్నాం. రైతులకు ఇచ్చే రుణాలకు సున్నావడ్డీ పథకాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి.
–నాగేశ్వర్ రెడ్డి, కంచన్నగారిపల్లె, కమలాపురం మండలం
రైతులను దగా చేయడమే
ఏటా రుణాలు సక్రమంగా చెల్లించడంతో బ్యాంకులు తిరిగి రుణాలివ్వడంతోపాటు ప్రభుత్వ వడ్డీ రాయితీ కూడా సక్రమంగా అందేది. రెండేళ్లుగా రైతులు రుణాలు సక్రమంగా చెల్లిస్తున్నా వడ్డీ రాయితీ రావడం లేదు. దీంతో చాలా మంది రైతులు నష్టపోయారు. ఇది రైతులను దగా చేయడమే.
– దస్తగిరిరెడ్డి, జిల్లా రైతు సంఘ నాయకుడు
సకాలంలో రుణాలు చెల్లించినా రైతులకు ఫలితం శూన్యం
18 నెలలుగా పైసా విదిల్చని కూటమి ప్రభుత్వం
ఉమ్మడి జిల్లాలో చాలా మంది రైతులకు నష్టం
రైతులపై కోట్లలో భారం ... ఆందోళనలో అన్నదాతలు
సున్నా వడ్డీకి సున్నం!
సున్నా వడ్డీకి సున్నం!
సున్నా వడ్డీకి సున్నం!


