ఎంట్రీఫీజు వసూలుకు టెండర్ రికార్డు
బి.కొత్తకోట: మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌పై ఉన్న అటవీశాఖ సముదాయంలోకి ప్రవేశ రుసుం వసూలుకు బుధవారం రాజంపేట డీఎఫ్‌ఓ కార్యాలయంలో నిర్వహించిన టెండర్లలో రికార్డుస్థాయి ధర దాఖలైంది. వివరాలు. హార్సిలీహిల్స్‌పై అటవీశాఖ పర్యావరణ సముదాయంలో జంతుప్రదర్శనశాల, మొసళ్లపార్కు, ప్రకృతి అధ్యయన కేంద్రం, పురాతన నీలగిరి వృక్షం ఉన్నాయి. వీటిని తిలకించేందుకు పర్యాటకులు అధికసంఖ్యలో వస్తుంటారు. ఇక్కడికి వచ్చేవారి నుంచి రూ.20 ఎంట్రీఫీజును నిర్దేశించిన అటవీశాఖ వాటిని వసూలు చేసుకునేందుకు ఏటా టెండర్లు నిర్వహిస్తోంది. 2026–27 ఏడాదికి నిర్వహించిన టెండర్లలో ఆరుగురు పాల్గొన్నారు. టెండర్ ధర రూ.29.90 లక్షలుగా నిర్ణయించగా వీరిలో కాండ్లమడుగుకు చెందిన ఇడగొట్టు రమేష్‌బాబు 31 లక్షల ఐదు రూపాయలకు టెండర్ దాఖలు చేయగా ఇదే అత్యధిక టెండర్ కావడంతో అధికారులు దీన్నే ఖరారు చేశారు. అలాగే క్యాంటిన్ నిర్వహణ కోసం రూ.1.75 లక్షలతో టెండర్లకు ఆహ్వనించగా శివన్న అనే వ్యక్తి అత్యధికంగా రూ.3.25 లక్షలకు టెండర్ దాఖలు చేయడంతో ఖరారు చేశారు. కాగా కొండపై అటవీశాఖ ఎంట్రీఫీజు వసూలుకు 2018 నుంచి అమలు చేస్తోంది. 2022 వరకు ఏటా రూ.ఆరేడు లక్షల ఆదాయం దక్కేది. 2022–23లో తొలిసారిగా 13,000,786 పలికింది. తర్వాత వరుగా పెరుగుతూ వస్తున్న ఆదాయంలో 2023–24లో రూ.14 లక్షలు, 2024–25లో రూ.16.50 లక్షలు, 2025–26లో రూ.19.60 లక్షలు పలికింది. ఇప్పుడు 2026–27కు 40శాతానికిపైగా ఆదాయంతో రూ.31లక్షలు పలకడం రికార్డు. కాగా మొదట రూ.10గా ఎంట్రీ రుసుము, రూ.20కి పెంచగా ప్రస్తుతం రూ.25గా చేయడంతో ఈ స్థాయిలో రూ.31 లక్షలు పలికింది.


