తమ్ముళ్ల తన్నులాట.. | - | Sakshi
Sakshi News home page

తమ్ముళ్ల తన్నులాట..

Feb 12 2026 7:23 AM | Updated on Feb 12 2026 7:23 AM

తమ్ముళ్ల తన్నులాట..

తమ్ముళ్ల తన్నులాట..

కత్తులు కట్టెలతో రాడ్లతో దాడులు..

తమ్ముడు మణికంఠకు తీవ్ర గాయాలు..

అనుయాయుల కోసం స్టేషన్‌ గడప తొక్కిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు,

మంత్రి అనుయాయులు

రాయచోటి : రాయచోటిలో తెలుగు తమ్ముళ్ల మధ్య వార్‌ రోజురోజుకు అధిగమవుతోంది. ఒకవైపు మంత్రి మండిపల్లి, ఇంకోవైపు పార్టీ జిల్లా అధ్యక్షుడు సుగవాసి వర్గీయుల గ్యాంగుల మధ్య దాడులు, ప్రతి దాడులు కొనసాగుతున్నాయి. దాడులను అదుపు చేయడానికి పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు అధికార పార్టీ అధినేతల ఒత్తిడుల కారణంగా విఫలమవుతున్నట్లు సమాచారం. దాడుల పరంపరలో బుధవారం టీడీపీకి చెందిన అధినేతల జోక్యం వివాదాలకు మరింత ఆజ్యం పోసేలా చేసింది. అనుచరులకు మద్దతుగా ఒకవైపు పార్టీ జిల్లా అధ్యక్షుడు సుగువాసి ప్రసాద్‌ బాబు, మరోవైపు మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి ముఖ్య అనుచరులైన బోనుమల ఖాదరవల్లి, విష్ణువర్ధన్‌ రెడ్డి తదితరులు రాయచోటి అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌ కు చేరుకున్నారు. వీరి రాకతో పోలీస్‌ స్టేషన్‌ ఆవరణమంతా వారి అనుయాయులు, గ్యాంగులతో నిండిపోయింది. ఒక దశలో పోలీస్టేషన్‌ ఆవరణం యుద్ధ వాతావరనాన్ని తలపించింది. నాలుగు రోజుల నుంచి రెండు వర్గాల మధ్య దాడులు, ప్రతి దాడులు సాగుతున్నాయి. బుధవారం సాయంత్రం పాత రాయచోటికి చెందిన మణికంఠ (35) పై రాడ్లు, కట్టెలతో మరో గ్యాంగ్‌ దాడికి తెగబడింది. ఈ ఘటనలో మణికంఠ తలపై తీవ్రమైన గాయాలయ్యాయి. సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఇరు వర్గాలకు చెందిన కొంతమందిని స్టేషన్‌ కు పిలిచి తమదైన స్టైల్‌ లో కౌన్సెలింగ్‌ ఇచ్చినట్లు సమాచారం. దీంతో పార్టీ అధినేతలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. గ్యాంగులకు అనుకూలంగా నాయకులు సైతం వత్తాసు పలుకుతుండడంతో వారిని నిలువరించడంలో పోలీసులు విఫలమవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏది ఏమైనా గ్యాంగులకు మద్దతుగా ఒకవైపు పార్టీ జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్‌ బాబు నేరుగా పోలీస్‌ స్టేషన్‌ గడప తొక్కడంతో నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య నెలకొన్న రాజకీయ విభేదాలు బహిర్గతమయ్యాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాయచోటిలో జరిగిన సంఘటనపై అర్బన్‌ సీఐ చలపతిని వివరణ కోరగా ఇరు వర్గాలను పిలిచి స్టేషన్లో కౌన్సెలింగ్‌ ఇచ్చామని, ఇలాంటి సంఘటనలు మరో మారు పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించి పంపినట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement