కూటమి పాలనలో చీకట్లే
లక్ష్యం నీరుగారింది
మదనపల్లె: జిల్లాలోని మారుమూల గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలనే ఉద్దేశంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన పనులను కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కింది. వైఎస్ జగన్‌కు ఆ ఖ్యాతి దక్కుతుందన్న అక్కసుతో వాటన్నింటిని రద్దు చేసి కొత్తగా తామనుకున్న ప్రాంతాలకు మొక్కుబడిగా ఏడు విద్యుత్ కేంద్రాలను మంజూరు చేసి చేతులుదులుపుకుంది. ఫలితంగా మెరుగైన సేవలు పొందాల్సిన ప్రజలు, రైతులకు ప్రయోజనం కలగకుండాపోయింది. విద్యుత్ వెలుగులు ప్రసరించాల్సిన మారుమూల ప్రాంతాల్లో చీకట్లు అలుముకొంటున్నాయి.
వైఎస్ జగన్ పాలనలో 36..
ప్రస్తుత అన్నమయ్య జిల్లా, పొరుగుజిల్లాల్లో కలిసిన రాజంపేట, కోడూరు నియోజకవర్గాలకు చెందిన గ్రామాలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 33/11 విద్యు త్ సబ్‌స్టేషన్లు 36 మంజూరయ్యా యి. చీమలచెరువుపల్లె, అరవీడు, రాయచోటి రింగ్‌రోడ్డు, రౌతుకుంట, తాటిగొండపల్లె, రాయచోటి టౌన్, దప్పేపల్లె, మాచిరెడ్డిగారిపల్లె, గోళ్లపల్లె, గాండ్లచెరువు, చీకటిపల్లె, కుమ్మరపల్లె, నారాయణరెడ్డిగారిపల్లె, యండపల్లె, మద్దినాయునిపల్లె, పాతకోట, పులికల్లు, కాలువపల్లె, బి.కొత్తకోట ఇందిరమ్మకాలనీ, దిన్నిమీదపల్లె, బాలయ్యగారిపల్లె, గట్టూరువారిపల్లె, బాలాపల్లె, రెడ్డివారిపల్లె, బాలరెడ్డిగారిపల్లె, కే.కందులవారిపల్లె, మార్గవపల్లె, అన్నమయ్యప్రాజెక్టు, సాదువారిపల్లె, రామలింగాపురం, అనంతసముద్రం, చెక్రయాపేట, మట్లివారిపల్లె, దండువారిపల్లె, బరినేపల్లిలకు ఈ విద్యుత్‌సబ్‌స్టేషన్లు మంజూరయ్యాయి. ఒక్కో సబ్‌స్టేషన్‌ను రూ.2 కోట్లతో నిర్మించేలా రూ.70 కోట్లు నిధులు కూడా మం జూరయ్యాయి.
వీటిస్థానంలో 7..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మంజూరుచేసిన 36 విద్యుత్ సబ్‌స్టేషన్లను పక్కనబెట్టిన కూటమి ప్రభుత్వం వాటిస్థానంలో ఏడు కొత్త సబ్‌స్టేషన్లకు మళ్లీ మంజూరు చేసింది. వీటిలో గత పాలనలో మంజూరైన గాలివీడు మండలంలోని చీమలచెరువుపల్లె, వీరబల్లి మండలంలోని తాటిగొండుపల్లె, చిట్వేలి మండలంలోని కే.కందులవారిపల్లె ఉండగా కొత్తగా ములకలచెరువు మండలంలోని సొంపల్లె, ఓబులవారిపల్లె మండలంలోని తల్లవారిపల్లె, రాయచోటిలోని బోయపల్లె, రామాపురంలో సబ్‌స్టేషన్లు మంజూరు చేశారు. వీటిలో మూడు చీమలచెరువుపల్లె, బోయపల్లె, తాటిగుంటపల్లె సబ్‌స్టేషన్లు పూర్తవ్వగా సొంపల్లెలో పనులు సాగుతున్నాయి.
అన్నమయ్య జిల్లాలో విద్యుత్ సరఫరా అంతరాయాలు, లోవోల్టేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా గత ప్రభుత్వం కొత్తగా 36 విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణాలకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న సబ్‌స్టేషన్లకు ఈ ప్రాంతాలకు దూరంగా ఉండటంతో పాటు విద్యుత్ సరఫరా నష్టాలు, లోఓల్టేజి, ఇబ్బందులు తలెత్తేవి. దాంతోపాటు వినియోగం భారీగా పెరగడంతో అంతరాయం అధికమైంది. దీన్ని అరికట్టి నాణ్యమైన విద్యుత్ సరఫరాకు కొత్త సబ్‌స్టేషన్ల ఏర్పాటే పరిష్కారమని గత ప్రభుత్వం గుర్తించి ఈ కేంద్రాలను, వాటికయ్యే నిధులను మంజూరు చేసింది. కూటమిపాలన రావడంతో 36 విద్యుత్ సబ్ స్టేషన్లలో 29 సబ్‌స్టేషన్లను నష్టపోవాల్సి వచ్చింది.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జిల్లాకు 36 విద్యుత్ సబ్‌స్టేషన్లు మంజూరు
కూటమి ప్రభుత్వంలో ఏడింటికే అనుమతి
వాటిలో పాతవి 3, కొత్తవి 4 ఇచ్చారు
తీవ్రంగా నష్టపోయిన జిల్లా ప్రజలు


