అభివృద్ధి పనుల ప్రగతిపై సమీక్ష
మదనపల్లె: జిల్లాలో ప్రభుత్వశాఖల ద్వారా చేపట్టిన పనులపై కలెక్టర్ నిశాంత్‌కుమార్ బుధవారం వివిధశాఖల జిల్లా అధికారులతో సమీక్షించారు. కలెక్టరేట్‌లో జరిగిన ఈ సమావేశంలో శాఖల వారీగా మంజూరైన అభివృద్ధి పనులు, వాటి ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా సూర్య ఘర్ పథకంలో లక్ష్యాలను పూర్తిచేయాలని, జిల్లాలోని జాతీయ, రాష్ట్ర రహదారుల పనులు వేగవంతం చేయా లని అధికారులను ఆదేశించారు. పీఎం సూర్య ఘర్ బిజిలీ యోజన, పీఎం కుసుం, ఆర్‌డీఎస్‌ఎస్ కార్యక్రమాల పనులు, ఎస్సీ, ఎస్టీ కేటగిరి వారికి సంబంధించి జిల్లాలో 12,242 రిజిస్ట్రేషన్‌లను స్వీకరించామని వీటి పనులు వివిధ దశలలో పురోగతిలో ఉన్నాయని అధికారులు తెలుపగా, సంబంధిత ఏజెన్సీలతో మాట్లాడి సోలార్ ప్యానళ్లను ఇన్స్టాలేషన్ పూర్తి చేయా లని ఆదేశించారు. ఆర్డీఎస్‌ఎస్ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని గ్రామాలకు 24 గంటల విద్యుత్ సరఫరా జరిగేలా విద్యుత్ ఫీడర్ల నిర్మాణం జరుగుతోందని విద్యుత్ శాఖ అధి కారి సోమశేఖర్‌రెడ్డి వివరించారు. జిల్లాలో మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె, రాయచోటి, పుంగనూరు, నియోజకవర్గాల్లో 1,652 కిలోమీటర్లలో గుంతలు పూడ్చి, రహదారుల పునరుద్ధరణ పనులను ఈనెలాఖరులోగా పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. రాయచోటి–వేంపల్లె, రాయచోటి–లక్కిరెడ్డిపల్లె, మదనపల్లె–పీలేరు జాతీయ రహదారుల పనులను పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమీక్షలో జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
● సత్వరమే లక్ష్యాలు సాధించాలి
● కలెక్టర్ నిశాంత్ కుమార్


