ద్విచక్ర వాహనదారుడికి గాయాలు
పుంగనూరు : ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని ఎదురుగా వచ్చిన మరో ద్విచక్రవాహనదారుడు ఢీకొనడంతో వ్యక్తి గాయపడిన సంఘటన మంగళవారం పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రామసముద్రం మండలం సింగంవారిపల్లెకి చెందిన రెడ్డెప్ప(55) ద్విచక్ర వాహనంపై పుంగనూరుకు వస్తుండగా పట్టణంలోని తాటిమాకులపాళెంలో ఎదురుగా మరో ద్విచక్రవాహనదారుడు అతివేగంగా వచ్చి ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో రెడ్డెప్పకు తీవ్రగాయాలుకావడంతో స్థానికులు గమనించి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేపట్టారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పైపులు ధ్వంసం చేశారని
ప్రశ్నిస్తే దౌర్జన్యం
నిమ్మనపల్లె : పొలంలోకి పశువులు తోలి పంట నష్టం చేయడమే కాకుండా పైపులు ధ్వంసం చేయడంతో ప్రశ్నిస్తే తనపై దౌర్జన్యం చేసి కొట్టి బెదిరించారని తవళం పంచాయతీ ఎగువపల్లెకు చెందిన ఆదెన్న కుమారుడు భరత్‌కుమార్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు... ఈ నెల 25న ఎగువపల్లెకు సమీపంలో భరత్‌కుమార్ తన భార్యతో కలిసి పొలం వద్ద పనులు చేసుకుంటుండగా, పక్క గ్రామమైన పారేసివారిపల్లెకు చెందిన నరసింహులు, మణికంఠకు చెందిన పశువులు పొలంలో ప్రవేశించి అల్లనేరేడు చెట్లు, పైపులు ధ్వంసం చేయగా, వాటిని బయటకు తోలారు. అంతలోనే మణి, నరసింహులు అక్కడకు రాగా పశువులను ఎందుకు వదిలేశారని ప్రశ్నిస్తే.. కులం పేరుతో దూషిస్తూ దాడికి పాల్పడి కొట్టారన్నారు. చంపేస్తామంటూ బెదిరించారన్నారు. వారి నుంచి ప్రాణహాని ఉందని, న్యాయం చేయాలని ఫిర్యాదులో కోరారు. మాలమహానాడు నాయకులు మాణిక్యం, గుండామనోహర్, రమణ, సుధాకర్, దళిత నాయకులు మునిరత్న తదితరులు బాధితుడికి అండగా స్టేషన్‌కు చేరుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేయాలన్నారు.
గ్రామకంఠం భూమి
ఆక్రమణకు యత్నం
మదనపల్లె రూరల్ : మండలంలోని అంకిశెట్టిపల్లె పంచాయతీ పప్పిరెడ్డిపల్లెలో గ్రామకంఠం భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించేందుకు ప్రయత్నించారు. మంగళవారం బెంగళూరు రోడ్డు పప్పిరెడ్డిగారిపల్లె రామాలయం పక్కన ఓవర్‌హెడ్ ట్యాంక్ సమీపంలోని గ్రామకంఠం భూమిని కొందరు వ్యక్తులు జేసీబీతో చదును చేస్తుండగా స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వీఆర్వో కల్యాణి, అక్కడకు చేరుకుని చదును చేస్తున్న వ్యక్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు సర్వేనెం.3/6లోని 0.79 సెంట్లు భూమి 22ఏ నిషేధిత జాబితాలో నుంచి తొలగిస్తూ రెవెన్యూ అధికారులు ఎన్‌ఓసీ జారీ చేసినట్లు తెలిపారు. అయితే ఆ స్థలంలో ఓవర్‌హెడ్ ట్యాంక్ పైప్‌లైన్ ఉన్నందున, దాని పక్కన ప్రభుత్వ స్థలం అయిన సర్వే నెంబర్. 3/8లోని గ్రామకంఠం భూమిలోకి మార్చేందుకు భూమిని శుభ్రం చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై వీఆర్వో స్పందిస్తూ, ప్రభుత్వ భూమిని అనుమతి లేకుండా చదును చేయకూడదని, తక్షణమే పనులు నిలిపివేయాల్సిందిగా ఆదేశించారు. మండల తహసీల్దార్‌ను కలిసి అనుమతులు తీసుకోవాల్సిందిగా తెలిపారు.
క్రీడల్లో రాణిస్తే భవిష్యత్తు
మదనపల్లె సిటీ : క్రీడల్లో రాణిస్తే మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీ డైరెక్టర్ డాక్టర్ ఎస్.రామలింగారెడ్డి అన్నారు. మంగళవారం కాలేజీలో జేఎన్‌టీయూ అనంతపురం ఆధ్వర్యంలో జరిగిన అంతర్ విశ్వవిద్యాలయాల క్రికెట్ జట్టు శిక్షణ ముగింపు కార్యక్రమం జరిగింది. ఎంపికై న విద్యార్థులు రాణించాలని ఆకాంక్షించారు. గెలుపోటములు సహజమని తెలియజేశారు. జట్టు ఈ నెల 29 నుంచి మైసూర్‌లోని జేఎస్‌ఎస్ సైన్స్ అండ్ టెక్నాలజీస్‌లో జరిగే అంతర్ విశ్వవిద్యాలయాల క్రికెట్ పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ రాయుడు, స్పోర్ట్సు కౌన్సిల్ బోర్డు సభ్యులు సతీష్‌కుమార్, కోచ్‌లు పాల్గొన్నారు.
కడప ఎడ్యుకేషన్ : పంజాబ్ రాష్ట్రంలోని యూనివర్సిటీలో జరుగుతున్న వెయిట్ లిఫ్టింగ్ పురుషుల విభాగంలో యోగి వేమన విశ్వవిద్యాయానికి చెందిన నీలమ్ సోపిన్ అనే విద్యార్థి 60 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించాడు. ఈయన స్నాచ్ విభాగంలో 1/2 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో 125 కేజీలు మొత్తంగా 237 కేజీల బరువు ఎత్తి విశ్వవిద్యాలయానికి బంగారు పతకం సాధించాడు. ఇదే విద్యార్థి ఈస్ట్ సౌత్ జోన్ అంతర్ విశ్వవిద్యాలయాల వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో కాంస్య పతాకాన్ని పొందారు. విశ్వవిద్యాలయం వారు హర్షం వ్యక్తం చేశారు.
ద్విచక్ర వాహనదారుడికి గాయాలు
ద్విచక్ర వాహనదారుడికి గాయాలు


