హత్య కేసును చేధించిన పోలీసులు
ఒంటిమిట్ట : మండల పరిధిలోని గుంటికాడిపల్లి పొలాల్లో 2025 డిసెంబర్ 21న నమోదు అయిన మల్లిక ఈశ్వరమ్మ హత్య కేసును ఒంటిమిట్ట పోలీ సులు చేధించారు. హత్య చేసిన నిందితుడు యల్లపల్లి రత్నంను శుక్రవారం మండల పరిధిలోని నడింపల్లి గ్రామ శివారులో అరెస్టు చేసినట్లు కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు స్థానిక సీఐ కార్యాలయంలో వెల్లడించారు. డీఎస్పీ మాట్లాడుతూ.. రాజంపేట మండలం, కొల్లవారిపల్లెకు చెందిన మల్లిక ఈశ్వరమ్మ భర్త వెంకట సుబ్బయ్య 5 ఏళ్ల కిందట మృతి చెందాడన్నారు. ఈ క్రమంలో ఈశ్వరమ్మ నెల్లూరు జిల్లా, రాపూరు మండలానికి చెందిన యల్లపల్లి రత్నయ్య అలియాస్ రమణ అనే వ్యక్తితో సహజీవనం సాగిస్తూ వచ్చిందన్నారు. ఈ క్రమంలో మల్లిక ఈశ్వరమ్మ, యల్లపల్లి రత్నయ్య మండల పరిధిలోని గుంటికాడిపల్లిలోని రాజా రెడ్డి మామిడి తోటలో కాపలా ఉండేందుకు వచ్చారని.. ఈ క్రమంలో డిసెంబర్ 20వ తేది రాత్రి ఈశ్వరమ్మ మీద అనుమానంలో రత్నం ఈమెను హత్య చేసినట్లు విచారణలో తేలిందన్నారు. కేసును చేధించిన ఒంటిమిట్ట సీఐ నరసింహారాజు, ఎస్‌ఐ శ్రీనివాసులు, సిద్దవటం ఎస్‌ఐ రఫీలను ఆయన అభినందించారు.


