మదనపల్లె ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడండి
మదనపల్లె రూరల్ : చరిత్ర పుటల్లో మదనపల్లెకు ప్రత్యేక స్థానం ఉంది. చారిత్రక నేపథ్యం కలిగిన మదనపల్లెకు, ఏ మాత్రం సంబంధం లేని పేరుతో జిల్లా పేరును ప్రకటించి స్థానిక ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించవద్దంటూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మదనపల్లె పేరుతోనే జిల్లా కేంద్రం కొనసాగించాలంటూ బహుజన్ సమాజ్‌పార్టీ(బీఎస్పీ) ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చరిత్ర చెరపద్దు, మదనపల్లె పేరు మార్చవద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. సరిగ్గా అదే సమయానికి అన్నమయ్యజిల్లా కేంద్రంగా మదనపల్లెను ప్రకటించినందుకు రాష్ట్రప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఎమ్మెల్యే షాజహాన్‌బాషా ఆధ్వర్యంలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ జిల్లా కలెక్టరేట్ వద్దకు చేరుకుంది. దీంతో బీఎస్పీ నాయకులు వారి రాకను అడ్డుకుంటూ రోడ్డుపై ప్లకార్డులు, బ్యానర్లుతో బైఠాయించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అప్రమత్తమైన పోలీసులు, నిరసనకారులను తమ ఆందోళనను విరమించాల్సిందిగా కోరారు. అయినప్పటికీ వారు వినకపోవడంతో చేసేదేమీలేక, పోలీసులు విజయోత్సవ ర్యాలీకి ఇబ్బంది లేకుండా ఉన్న దారిలోనే కొంత మేర క్లియర్ చేసి పంపారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్‌కుమార్ మాట్లాడుతూ... అన్నమయ్య జిల్లా పేరు మార్చేవరకు తమ ఆందోళన విరమించమన్నారు. కూటమిప్రభుత్వం అధికారంలో ఉన్నందున మదనపల్లెను జిల్లా కేంద్రంగా కొనసాగిస్తారని, భవిష్యత్తులో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే ఏమైనా మార్పులు జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. కలెక్టర్ కార్యాలయం నేమ్‌బోర్డులో ఎక్కడా మదనపల్లె పేరు లేకుండా ఏర్పాటు చేయడంపై అనుమానం వ్యక్తం చేశారు. సీపీఐ నియోజకవర్గసమితి కార్యదర్శి మురళీ మాట్లాడుతూ మదనపల్లె ప్రజలకు ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం తప్పిందని ఆరోపించారు. మదనపల్లె ప్రజల ఆకాంక్ష మదనపల్లె జిల్లా అన్నారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు బాలాజీ, శ్రీనాథ్, చంద్ర, శివ, లక్ష్మీపతి, సోమశేఖర్, ప్రశాంత్, మహేష్, శశికుమార్‌రెడ్డి, రెడ్డెప్ప, మోహన తదితరులు పాల్గొన్నారు.
జిల్లాకు మదనపల్లె పేరు పెట్టాలి
రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన బీఎస్పీ నాయకులు
ఓ వైపు విజయోత్సవ ర్యాలీ,
మరో వైపు నిరసన ర్యాలీ
ఉద్రిక్త వాతావరణంతో
అప్రమత్తమైన పోలీసులు


