మదనపల్లెలో వాజ్‌పేయి విగ్రహావిష్కరణ
టీడీపీ నాయకుల డుమ్మా
మదనపల్లె: మదనపల్లె పట్టణం అన్నమయ్య సర్కిల్‌లో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్ పేయి విగ్రహాన్ని ఆదివారం ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామి చేతులమీదుగా ఆవిష్కరించారు. ఆయన హెలిక్యాప్టర్‌లో మదనపల్లె చేరుకోగానే స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. బీటీ కళాశాల మైదానం నుంచి బస్సులో పార్టీనేతలతో కలిసి చేరుకున్న సీఎం పుష్కర్‌సింగ్ ధామి..వాజ్‌పేయి విగ్రహంపై కప్పిన కాషాయ వస్త్రాన్ని తొలగించి ఆవిష్కరించి పూలదండ వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మదనపల్లెతో వాజ్‌పేయికి ఉన్న అనుబంధాన్ని తెలుసుకుని ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, మంత్రి సత్యకుమార్, 20 సూత్రాల అమలు కమిటి చైర్మన్ లంకా దినకర్, శాసనమండలి డెప్యూటీ చైర్మెన్ జకియాఖానం, జిల్లా అధ్యక్షులు సాయిలోకేష్, సీనియన్ నేత చల్లపల్లె నరసింహారెడ్డి, విష్ణుకుమార్‌రెడ్డి, బర్నెపల్లె రవికుమార్, ఆకుల కృష్ణమూర్తి, పులి నరేంద్ర, ఎన్.శోభారాణి, బావాజి తదితరులు పాల్గొన్నారు.సీఎం పుష్కర్‌సింగ్ ధామి రాక సందర్భంగా బీజేపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు.ర్యాలీలో ఎమ్మార్పీఎస్ శ్రేణులు, బీజేపీకి చెందిన వివిధ విభాగాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
అటల్–మోదీ సుపరిపాలన యాత్ర పేరిట ఆదివారం మదనపల్లెలో జరిగిన వాజ్‌పేయి విగ్రహావిష్కరణ, టిప్పు సుల్తాన్ మైదానంలో జరిగిన సభకు టీడీపీ ప్రజాప్రతినిధులు హాజరు కాలేదు. సభలో స్థానిక ఎమ్మెల్యే షాజహాన్‌బాషా, పీలేరు ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌రెడ్డి, టౌన్‌బ్యాంక్ చైర్మన్ విద్యాసాగర్‌లను వేదికపైకి ఆహ్వనించినా వారు గైర్హాజరయ్యారు. వారితోపాటు టీడీపీ శ్రేణులు ఎవరూ పాల్గొనలేదు. జనసేనకు చెందిన కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్, రాయలసీమ కో–కన్వీనర్ రామదాస్ చౌదరి, మార్కెట్ కమిటి చైర్మన్ శివరాం, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
పట్టణంలో బైక్ ర్యాలీ
టీడీపీ దూరం


