గంగమ్మా..కాపాడవమ్మా
లక్కిరెడ్డిపల్లి: కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్న శ్రీ అనంతపురం గంగమ్మ ఆలయానికి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. గంగమ్మా..కాపాడవమ్మా అని వేడుకున్నారు. బోనాలు సమర్పించి తలనీలాలు అర్పించారు. జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. పూజారులు చెల్లు వంశీయులు భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.
కడప కార్పొరేషన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 15వతేదీన ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డయల్ యువర్ ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు మొబైల్ నంబరు: 8977716661కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను సీఎండి దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు.
గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లికి రాయచోటికి చెందిన దాతలు శ్రీనివాసులు,సూర్యకుమారి దంపతులు బంగారునెక్లెస్ బహూకరించారు. రూ. 3.84 లక్షలు విలువ చేసే 30గ్రాముల బంగారు నెక్లెస్‌ను ఆదివారం ఆలయ కమిటీ చైర్మన్ రాజన్ననాయుడు, ఈవో మంజులలకు అందజేశారు. ఈసందర్భంగా దాతలకు ఆలయ సాంప్రదాయలతో స్వాగతం పలికి అమ్మవారికి పూజలు చేయించారు. శేష వస్త్రంతో దాతలను సన్మానించారు.
గంగమ్మా..కాపాడవమ్మా


