షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
నందలూరు : మండల పరిధి నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామ పంచాయతీలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఎదురుగా ఉన్న వీధిలో మాజీ ఎంపీటీసీ స్వామి ఎలుమలై ఇల్లు శుక్రవారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదానికి గురై దగ్ధమైంది. ఫైర్ అధికారులకు సమాచారం అందించడంతో వారు వెంటనే వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ సందర్భంగా బాధితుడు ఏలుమలై మాట్లాడుతూ ఆకస్మాత్తుగా తెల్లవారుజామున తమ బెడ్ రూమ్‌లో మంటలు రావడంతో ముందుగా ఇంటికి సంబంధించిన విద్యుత్ మెయిన్ ఆఫ్ చేసి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశామన్నారు. అప్పటికే గదిలోని పలు విలువైన వస్తువులు, చీరలతోపాటు బీరువాలో ఉంచిన లక్ష రూపాయల నగదు, 10 తులాల బంగారు, ఒకటిన్నర కేజీ వెండి, అగ్నికి ఆహుతయ్యాయని తెలిపారు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరారు. ఈ విషయం తెలుసుకున్న రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు భూమన శివశంకర్‌రెడ్డిలు ఏలుమలై ఇంటికి వెళ్లి పరిశీలించి, బాధితులను పరామర్శించారు. ఫైర్ ఎస్‌ఐ రాధాకృష్ణ ఆధ్వర్యంలో డీఓబీ పురుషోత్తం, హెడ్ కానిస్టేబుల్ రవీంద్రబాబు, కె.రాజేశ్వర్‌లు మంటలను అదుపులోకి తెచ్చారు.


