హృదయాల్లో ఆధ్యాత్మికతను వెలిగించాలి
కురబలకోట : హృదయాల్లో ఆధ్యాత్మికతను వెలిగించాలని, మంచి వాళ్లు కుటుంబానికి సమాజానికి కూడా మూల ధనం లాంటి వారని హజరత్ మౌలానా కారి అహ్మద్ పేర్కొన్నారు. కురబలకోట మండలం ముదివేడులోని ముస్లిం పూర్‌లో ప్రజా శాంతి, శ్రేయస్సు, ఐకమత్యం కోసం జల్సా పేరుతో గ్రామస్తుల ఆధ్వర్యంలో శనివారం రాత్రి ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సందేశం ఇస్తూ హృదయ శుద్ధి గలవారు దేవుని చూస్తారన్నారు. ఎవరు ఎవరిని మార్చలేరని ఎవరికి వారు మార్పు చెంది స్వతహాగా మారాల్సిందేనన్నారు. మనిషి హృదయం మారితే సమాజం మారుతుందన్నారు. మనిషి అసలు అందం అతని హృదయంలో ఉండే మంచితనమేనన్నారు. అల్లాహ్ ప్రేమను పొందడానికి ముందుగా అహంకారం, ద్వేషం, లోభాన్ని తొలగించుకోవాలన్నారు. చేసే సాయం, మంచి పనులు ఇతరుల జీవితాల మార్పుకు దోహదపడతాయన్నారు. మాననీయ విలువల కన్నా డబ్బు గొప్పది కాదన్నారు. నమాజ్, దువా, ఖురాన్ పఠనం మనసును పరిశుభ్రం చేస్తాయన్నారు. ఇవి దేవునికి సమీపంగా తీసుకెళతాయన్నారు. జీవన విధానంలో విశ్వాసం, నిబద్దత, నిజాయితీ, మాననీయత, మంచితనం, క్షమ, సహనంతో పాటు ఆధ్యాత్మికతను పాటించే వారిని అల్లాహ్ ఎంతగానో ఇష్టపడతారన్నారు. ఈ కార్యక్రమంతో ఆధ్యాత్మికత వెల్లి విరిసింది.
కడప– బెంగళూరు రైల్వేలైన్ ప్రతిపాదనపై
అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఇటీవల జరిగిన రైల్వే అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముద్దనూరు– ముదిగుబ్బ మీదుగా బెంగళూరుకు రైల్వే లైను నిర్మాణం జరపాలని చేసిన ప్రతిపాదనపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. శనివారం నగరంలోని సీపీఐ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కడప– బెంగళూరు రైలు మార్గంపై ఇదివరకే పెండ్లిమర్రి, రాయచోటి, మదనపల్లి మీదుగా ఒక ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. జిల్లాలో విస్తారంగా పండించే అరటి, మామిడి, చీనీ, బొప్పాయి, చామంతి పంటల ఎగుమతికి పెండ్లిమర్రి మీదుగా కడప– బెంగళూరు రైల్వే లైను నిర్మాణానికి 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రణాళిక రూపొందించారన్నారు. రూ.2వేల కోట్ల అంచనా వ్యయంతో 157 కిలో మీటర్ల మేర చేపట్టాల్సిన పనులను వైఎస్సార్ మరణానంతరం అటకెక్కించారన్నారు. అనుమతులున్న పాత ప్రాజెక్టుకు రూ. 2వేల కోట్లు కేటాయిస్తే రైల్వే పనులు పూర్తి చేయడానికి అవకాశం ఉన్నదన్నారు. కానీ ఆ దిశగా ఆలోచించకుండా కొత్త ప్రాజెక్టు ప్రతిపాదన తీసుకురావడంలోని ఆంతర్యమేమిటన్నారు. పాత ప్రాజెక్టుకు కేటాయించిన వందల కోట్ల నిధులు నిరుపయోగం కావాల్సిందేనా అని ప్రశ్నించారు. ఇలాంటి సందర్భాలలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
హృదయాల్లో ఆధ్యాత్మికతను వెలిగించాలి


