విద్యారంగంలో వికటిస్తున్న ప్రయోగాలు
కడప ఎడ్యుకేషన్ : రాష్ట్రంలోని పాఠశాల విద్యా రంగంలో అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న ప్రయోగాలు వికటిస్తున్నాయని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. కడప నగరంలోని జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో శనివారం ఎస్‌టీయూ 79వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యారంగంలో నూతన పోకడలకు పోకుండా పాఠశాలల్లో గుణాత్మక విద్య సాధనకు తగిన తోడ్పాటును ఉపాధ్యాయులకు అందిస్తుందని ఆశించామన్నారు. కానీ 2025 జూన్ నుంచి పాఠశాల విద్యారంగం ప్రయోగాలకు లోనవుతోందన్నారు. ఉపాధ్యాయుడికి బోధనా సమయాన్ని ఇవ్వకుండా పాఠశాల నిర్వహణకే పరిమితం చేస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు సగటు ఉపాధ్యాయులను ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఎస్‌ఎస్‌సి యాక్షన్ ప్లాన్ పేరుతో కేవలం ఒక తరగతి పైనే సగం విద్యా సంవత్సరం దృష్టి పెట్టి మిగతా తరగతులను నిర్లక్ష్యం చేయడం సరైన పద్ధతి కాదన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి మాట్లాడుతూ సిలబస్‌కు సంబంధం లేని పద్ధతిలో ప్రశ్నాపత్రాలను రూపొందించి ఉపాధ్యాయులు తయారు చేసిన ప్రశ్నాపత్రాలను పక్కనపెట్టి ప్రధమ్ అనే ఎన్జీఓ సంస్థ ద్వారా ప్రశ్నా పత్రాలు తయారు చేయించడంలో ఉన్న ఆంతర్యం ఏమిటో అర్థం కాలేదన్నారు. ఆ ప్రశ్నల ద్వారా మూల్యాంకనం చేపట్టడం అనేది అటు విద్యార్థులకు ఇటు ఉపాధ్యాయులకు గందరగోళంగా మారిందన్నారు. జూన్ నెలలో బదిలీలు పూర్తి చేసినప్పటికీ ఇప్పటికీ పది నుంచి పదిహేను శాతం మంది రిలీవర్లు లేక అదే స్థానాల్లో కొనసాగుతున్నారన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకం కోసం ప్రతిపాదనలు పంపితే కేవలం 30 శాతం మాత్రమే అనుమతిస్తూ కమిషనర్ నిర్ణయించడం సరికాదన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కోటేశ్వరరావు, ఉపాధ్యాయ చీఫ్ ఎడిటర్ గాజుల నాగేశ్వరరావు, సంయుక్త అధ్యక్షులు సురేష్‌బాబు, నాగిరెడ్డి, శివప్రసాద్, రాష్ట్ర నాయకులు బాల గంగిరెడ్డి, ఇలియాస్ బాషా, రమణారెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంగమేశ్వర్ రెడ్డి, పాలకొండయ్య, నాయకుడు సుబ్రహ్మణ్యంతోపాటు రాష్ట్రంలోని 25 జిల్లాల నుంచి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వివిధ జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఎస్టీయు రాష్ట్ర అధ్యక్షుడు సాయి శ్రీనివాస్


