రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

Dec 14 2025 8:32 AM | Updated on Dec 14 2025 8:32 AM

రోడ్డ

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

రాజంపేట : రాజంపేట మండలం, బోయనపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. స్కూటీలో రాజంపేట నుంచి నందలూరుకు వస్తున్న క్రమంలో బొలోరో వాహనం ఢీ కొందని మన్నూరు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మనీష్‌, రామ్‌ చరణ్‌లకు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. చికిత్స నిమిత్తం రాజంపేట ప్రాంతీయ వైద్యశాలకు తరలించి మెరుగైన చికిత్సకోసం తిరుపతికి తీసుకెళ్లారు. ఈ మేరకు మన్నూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భవన నిర్మాణ

కార్మికుడిపై దాడి

మదనపల్లె రూరల్‌ : భవన నిర్మాణ కార్మికుడిపై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ముసుగులతో వచ్చి దాడిచేసిన ఘటన శుక్రవారం రాత్రి మదనపల్లెలో జరిగింది. మండలంలోని ఎర్రగానిమిట్ట సమీపంలో టిడ్కో ఇళ్ల వద్ద నివాసం ఉంటున్న రామన్న కుమారుడు రమేష్‌బాబు(40) భవన నిర్మాణ కార్మికుడుగా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి పట్టణంలో పనులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు ఆటోలో ఎక్కి టిడ్కో ఇళ్ల సమీపంలో దిగాడు. నడుచుకుంటూ వెళుతుండగా ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి ముసుగులు వేసుకువచ్చి రమేష్‌బాబుపై దాడిచేసి కొట్టారు. గాయపడిన బాధితుడిని స్థానికులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా, తాము నివాసం ఉంటున్న పక్కింటిలో కొందరు వ్యక్తులతో విభేదాలు ఉన్నాయని, వారి మనుషులు దాడిచేసి ఉంటారని బాధితుడు చెబుతున్నాడు.

ఇంటర్‌ విద్యార్థిపై ..

మదనపల్లె రూరల్‌ : ఇంటర్‌ విద్యార్థిపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన శనివారం రాత్రి మదనపల్లెలో జరిగింది. చిత్తూరుజిల్లా పుంగనూరు మండలం చండ్రమాకులపల్లె పంచాయతీ కృష్ణాపురానికి చెందిన రాజబాబు, కళావతి దంపతుల కుమారుడు రెడ్డిప్రసాద్‌(18) స్థానికంగా ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నాడు. ఈ క్రమంలో శనివారం కాలేజీ వదిలిన తర్వాత రెడ్డిప్రసాద్‌ గ్రామానికి చెందిన విద్యార్థినిని మదనపల్లెకు చెందిన ఓ యువకుడు టీజీంగ్‌ చేశాడు. ఈ విషయమై రెడ్డిప్రసాద్‌ అతడిని నిలదీశాడు. దీంతో యువకుడు మరి కొందరితో కలిసి గుంపుగా వచ్చి రెడ్డిప్రసాద్‌ కోమటివానిచెరువు కట్టపై నడిచి వస్తుండగా, విచక్షణారహితంగా దాడిచేసి కొట్టారు. చంపేస్తామంటూ బెదిరించారు. దాడిలో రెడ్డిప్రసాద్‌ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకోగా గమనించిన స్థానికులు బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్‌ చేశారు. టూటౌన్‌ పోలీసులు విచారణ చేస్తున్నారు.

యువతి అదృశ్యం

ముద్దనూరు : మండలంలోని యామవరం గ్రామానికి చెందిన ఓ యువతి అదృశ్యమైనట్లు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఏఎస్‌ఐ రమేష్‌ సమాచారం మేరకు యామవరానికి చెందిన యువతి ఇంటర్మీడియట్‌ చదువుతోంది. శుక్రవారం రాత్రి ఆమె ఇంటిలో ఉంది. శనివారం తెల్లవారుజాము నుంచి కనిపించలేదు. చుట్టుపక్కల విచారించినా ఫలితం లేకపోవడంతో తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.

అదనపు కట్నం కోసం

వేధింపులపై కేసు

ముద్దనూరు : భర్తతో పాటు బంధువులు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని భార్య ఫిర్యాదు మేరకు శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ మైనుద్దీన్‌ సమాచారం మేరకు మండలంలోని కొర్రపాడు గ్రామానికి చెందిన గంగాకృష్ణవేణికి ఓబుళాపురం గ్రామానికి చెందిన గణేష్‌ అనే వ్యక్తితో సమారు 6నెలల క్రితం వివాహమైంది. వివాహ సమయంలో 13 తులాల బంగారు కట్నం కింద గణేష్‌కు ఇచ్చారు. అయితే గత కొంత కాలంనుంచి అదనపు కట్నం తేవాలని భర్త గణేష్‌, అతని బంధువులు తనను వేధిస్తున్నారని గంగాకృష్ణవేణి ఫిర్యాదు చేసింది. దీంతో గణేష్‌తో పాటు మరో నలుగురిపై అదనపు కట్నం కోసం వేధిస్తున్నట్లు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

కుక్కల బారినపడి

పొడదుప్పి మృతి

అట్లూరు : మండల పరిధిలోని కళావాండ్లపల్లి గ్రామం కుక్కల బారిన పడి పొడదుప్పి మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు శనివారం ఉదయం లంకమల అభయారణ్యం నుంచి కళావాండ్లపల్లి గ్రామం వైపు కొన్ని పొడదుప్పిలు గుంపుగా రావడంతో కుక్కలు వెంబడించి ఓ దుప్పిని గాయపరిచాయి. స్థానికులు గుర్తించి ఎస్‌ఐ నాగకీర్తనకు సమాచారం ఇవ్వడంతో ఆమె సిద్ధవటం ఫారెస్టు రేంజ్‌ అధికారి కళావతికి సమాచారం ఇచ్చారు. సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించగా అప్పటికే దుప్పి మృతి చెంది ఉంది.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు1
1/1

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement