లోకపావనీ.. పాహిమాం
● అంగరంగ వైభవంగా ఈశ్వరీదేవి ఆరాధనోత్సవాలు
● ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
● పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తజనం
బ్రహ్మంగారిమఠం : దేవీ శరణం.. లోకమాతా పాహిమాం.. జగజ్జననీ రక్షమాం అంటూ భక్తులు వేడుకున్నారు. బ్రహ్మంగారిమఠం భక్తజన సంద్రంగా మారింది. శ్రీఈశ్వరీదేవి ఆరాధన గురుపూజ మహోత్సవాలు మూడు రోజులుగా కనుల పండువగా జరుగుతున్నాయి. అమ్మవారు సజీవ సమాధి నిష్ట వహించిన రోజైన శనివారం కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారి మాలధారులు ఇరుముడి సమర్పించారు.
పట్టు వస్త్రాలు సమర్పణ
రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పావులూరి హనుమంతరావు ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళా భక్తులు అమ్మవారికి పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ సమర్పించారు. శ్రీ విశ్వకర్మ విరాట్ భవన్ నుంచి వారు ఊరేగింపుగా అమ్మ సన్నిధానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కోలాటం తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ధ్వజ స్తంభం వద్ద 108 దీపాలను వెలిగించి, 108 కొబ్బరి కాయలు కొట్టి త్వరితగతిన లోకపావని ఆలయ పునః నిర్మాణం జరగాలని ప్రార్థించారు. అలాగే శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి, మాతా గోవిందమాంబకు పట్టువస్త్రాలు సమర్పించారు. విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అంగలకుదుటి సుశీల నేతృత్వంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షురాలు తాళబత్తుల వాసవి, ప్రధాన కార్యదర్శి లక్కోజు సుజాత, బాపట్ల జిల్లా మహిళా అధ్యక్షురాలు భారతి తదితరులు పాల్గొన్నారు. మఠాధిపతి శ్రీ వీరశివకుమారస్వామి, రాజరాజేశ్వరిదేవి దంపతులు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయ ట్రస్టు బోర్డు మెంబర్ వడ్ల రాజ్యలక్ష్మి, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి దువ్వూరి నరసింహాచారి, న్యాయ సలహా కమిటీ చైర్మన్ గురుప్రసాద్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పెద్దబాబు, కోనసీమ జిల్లా వైస్ ప్రెసిడెంట్ వరదసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కమనీయంగా దీక్షా బంధన అలంకరణ
మధ్యాహ్నం లోకపావని దీక్షా బంధన అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని శోభాయమానంగా అలంకరించారు. అల్పాహారం, అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రాత్రి పండ్లతో తులాభారం నిర్వహించి, వాటిని భక్తులకు పంపిణీ చేశారు. సింహ వాహనోత్సవం ఉత్సాహ భరితంగా జరిగింది. సహస్ర దీపాలంకరణ వెలుగుతో దేవస్థానం కాంతులీనింది. కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన ప్రగతి నృత్యాలయ కళాట్రస్ట్ బృందం ప్రదర్శించిన నృత్యం ఆకట్టుకుంది. గుంటూరుకు చెందిన కుమారి తిరువళ్లూరి దివ్యశరణి భాగవతారిణి హరికథా గానం అలరించింది.
సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. మఠం నిర్వాహకులు, అన్నదాన సత్రాల వారు వసతి సౌకర్యాలు కల్పించారు. ఆలయ ఈఓ బీవీ జగన్‌మోహన్‌రెడ్డి పర్యవేక్షణలో మఠం సిబ్బంది, అమ్మవారి శిష్యులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో దాతలు వొమ్మిన చిన్న ఈశ్వరయ్యశ్రేష్టి, మారంరెడ్డి రామనారాయణరెడ్డి, కడారు విశ్వనాథాచార్యులు, అంకిరెడ్డిపల్లె ఓబుల్‌రెడ్డి, కోడూరు శ్రీనివాస రావు, చెరువుపల్లి వీరయ్యస్వామి, చేవూరి రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే
శ్రీ ఈశ్వరీదేవి ఆరాధనోత్సవాల్లో మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి పాల్గొని, అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మఠాధిపతి శ్రీ వీరశివకుమారస్వామిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఆలయ నిర్వాహకులు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డిని సత్కరించారు. తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు రత్నకుమార్ యాదవ్, ఎంపీటీసీ మనోహరాచారి, నాయకులు భాస్కరరెడ్డి, ఉమాపతి, సుబ్బారెడ్డి, చంద్రఓబుల్‌రెడ్డి, జోగయ్య పాల్గొన్నారు.
లోకపావనీ.. పాహిమాం
లోకపావనీ.. పాహిమాం


