రాయచోటి వద్దు.. కడప ముద్దు
సిద్దవటం : మండలంలోని భాకరాపేట చెక్‌పోస్ట్ వద్ద జేఏసీ నాయకులు శనివారం రాయచోటి వద్దు.. కడప ముద్దు అంటూ వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రజాభీష్టం మేరకే ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాలన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి కేంద్రంగా సిద్దవటం మండలాన్ని కలపడం సహేతుకంగా లేదన్నారు. సిద్దవటం మండలం కడపలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే మాధవరం–1 గ్రామంలో మహిళా నాయకురాలు ఏకుల రాజేశ్వరిరెడ్డి, కేవీ సుబ్బయ్య, నరసింహారెడ్డి, తుర్రా ప్రతాప్, రెడ్డెయ్య రిలే నిరాహారదీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా విద్యార్థులు మహిళలు, జేఏసీ నాయకులు కడప–చైన్నె జాతీయ రహదారిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి రాజంపేట జనసేన నాయకుడు అతికారి కృష్ణ సంఘీభావం తెలిపారు. కాగా ఇదే సమయంలో తిరుపతి నుంచి కడప వైపు వెళ్తున్న ఇన్‌చార్జి మంత్రి సవితమ్మ కారును ఆపి సిద్దవటం మండలాన్ని కడపలోనే కొనసాగించాలని జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు అనిల్‌కుమార్‌రెడ్డి, చలపాటి చంద్ర, వినోద్, నాయబ్ రసూల్, శివయ్య, వెంకట్, రవిశంకర్, డాక్టర్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
కడప జిల్లానే ఆమోదయోగ్యం
ఒంటిమిట్ట : సిద్దవటం, ఒంటిమిట్ట మండలాలు కడప జిల్లాలోనే కొనసాగించడమే అన్ని విధాలా ఆమోదయోగ్యం అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మాజీ డైరెక్టర్ ఆకేపాటి వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలను అన్నమయ్య జిల్లాలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం కోదండ రామాలయం వెనుక వైపు 8వ రోజు కొనసాగిన జేఏసీ రిలే నిరాహార దీక్షలో ఆయనతో పాటు మండల అధ్యక్షుడు టక్కోలు శివారెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు. పిడుగు వెంకట శేషారెడ్డి, సుంకేసుల సుబ్బరాయుడు, కో–ఆప్షన్ మెంబర్ షేక్ మహ్మద్ రఫీ, బత్తల సుబ్బనరసయ్య, పందేటి చంద్రశేఖర్ రాజు దీక్షలో కూర్చున్నారు. ప్రజల అభిప్రాయాలను గౌరవించి ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలను కడప జిల్లాలోనే కొనసాగించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మండల జేఏసీ అధ్యక్షుడు భవనాసి రామదాసు, ఉపాధ్యక్షుడు పాటూరి గంగిరెడ్డి, జేఏసీ నాయకుడు బాలరాజు శివరాజు, చంద్రసుధాకర్ రెడ్డి, గురుమోహన్ రాజు, సిరిపిరెడ్డి సుబ్బారెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాయచోటి వద్దు.. కడప ముద్దు


