అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి
వీరబల్లి : సోమవరం పంచాయతీలోని సోమవరం వడ్డిపల్లిలో దీపిక (16) అనే మైనర్ బాలిక అనుమానాసపద స్థితిలో మంగళవారం మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. దీపిక తల్లిదండ్రులు రెండు నెలల నుంచి సోమవరం వడ్డిపల్లిలో నాగేంద్ర అనే యజమాని దగ్గర ఎనుములు మేపుతూ జీవనం సాగించేవారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం వారు నివాసం ఉంటున్న రేకుల గదిలో అనుమానాస్పద స్థితిలో దీపిక మృతి చెందింది.
బాలిక తల్లి లక్ష్మీదేవిది కోడూరు నియోజకవర్గంలోని సిద్దారెడ్డిగారిపల్లి కాగా ఈమె మొదట వివాహం చేసుకున్న భర్తను వదిలేసి వీరబల్లి మండలం, సోమవరం వడ్డిపల్లికి చెందిన నాగరాజును రెండో వివాహం చేసుకుంది. వీరు ఎనుములు మేపుకుంటూ ఉండేవారు. నెల క్రితం సొంత ఊరికి వెళ్లి మొదటి భర్త దగ్గర ఉన్న దీపికను తీసుకు లక్ష్మిదేవి వడ్డిపల్లికి వచ్చింది. ఇంతలోనే బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ నరసింహారెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.


