కలెక్టర్ కార్యాలయంగా మదనపల్లె సబ్ కలెక్టరేట్
మదనపల్లె రూరల్: మదనపల్లె జిల్లా కలెక్టర్ కార్యాలయంపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. ముందు నుంచీ అందరూ అనుకున్నట్లుగానే సబ్ కలెక్టరేట్‌ను, జిల్లా కలెక్టర్ కార్యాలయంగా ఏర్పాటు చేసేందుకు పనులు వేగవంతం చేశారు. మదనపల్లె జిల్లా ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం గత నెల 27వ తేదీన ప్రిలిమనరీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై అభ్యంతరాలు, సలహాల స్వీకరణకు 30 రోజులు అనగా డిసెంబర్ 27వ తేదీ వరకు గడువు ఇచ్చింది. దీంతో నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచే పట్టణంలో కలెక్టర్, ఎస్పీ, ఇతర ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుపై విస్తృతంగా చర్చలు మొదలయ్యాయి. మూడు రోజుల క్రితం జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్, పట్టణంలోని బీటీ కాలేజీ, జీఆర్‌టీ హైస్కూల్, జీఎంఆర్ పాలిటెక్నిక్, రేస్ బీఈడీ కాలేజీ భవనాలను పరిశీలించి వెళ్లడంతో ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. మదనపల్లె చరిత్రలో బీటీ కళాశాలకు ప్రత్యేక స్థానం, ప్రాముఖ్యత ఉన్న నేపథ్యంలో బీటీ కాలేజీని ప్రభుత్వ కార్యాలయాలకు స్వాధీనం చేసుకుంటే, దాని మనుగడకు ఇబ్బంది కలుగుతుందేమోనన్న ఆందోళన పట్టణ ప్రజల్లో మొదలైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి నాయకులు బీటీ కళాశాలకు పూర్వ వైభవం తీసుకువస్తామని చెప్పడమే కాకుండా యూనివర్సిటీగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో.. ఆ దిశగా చర్యలు తీసుకోకపోగా, ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగించేందుకు పరిశీలించడంపై ప్రజల్లో వ్యతిరేకత కనిపించింది. ఈ విషయమై మంగళవారం బహుజన సమాజ్ పార్టీ అన్నమయ్య జిల్లా ఇన్‌చార్జి మిద్దేపల్లె బాలాజీ, నాయకులతో కలిసి సబ్ కలెక్టర్ చల్లా కల్యాణికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ వారితో మాట్లాడుతూ.. బీటీ కాలేజీ, జీఆర్‌టీ హైస్కూల్‌ను జిల్లా కలెక్టర్ పరిశీలించడం తప్పితే, ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు నిర్ధారించలేదని తెలిపారు. మదనపల్లె జిల్లా కలెక్టర్ కార్యాలయంగా సబ్ కలెక్టర్ కార్యాలయమే ఉంటుందని, అందులో భాగంగానే ఏర్పాట్లు ముమ్మురం చేస్తున్నట్లు చెప్పారు. మంగళవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌లో కాన్ఫరెన్స్ హాల్, జేసీ చాంబర్, ఇతర విభాగాలకు సంబంధించి కొలతలు వేస్తూ మార్పులు, చేర్పులు, సర్దుబాటుకు సంబంధించి ప్రక్రియ ప్రారంభించారు. మదనపల్లె జిల్లాకు...వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి సుమారు 64 కార్యాలయాలకు భవనాలు ఎంపిక చేయాల్సి ఉండటంతో అనువైన వాటి కోసం కసరత్తు చేయడంలో రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు.
మదనపల్లె జిల్లా కలెక్టర్ కార్యాలయంగా మారనున్న సబ్ కలెక్టరేట్
ఏడీ బిల్డింగ్‌లో కొలతలు వేస్తున్న ఇంజినీరింగ్ సిబ్బంది
శరవేగంగా ఆఫీసులో మార్పులు, చేర్పులు
ప్రభుత్వ కార్యాలయాల కోసంఅధికారుల కసరత్తు
కలెక్టర్ కార్యాలయంగా మదనపల్లె సబ్ కలెక్టరేట్


