సెల్‌టవర్‌ ఎక్కి డ్వాక్రా మహిళ ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

సెల్‌టవర్‌ ఎక్కి డ్వాక్రా మహిళ ఆత్మహత్యాయత్నం

Dec 10 2025 7:46 AM | Updated on Dec 10 2025 7:46 AM

సెల్‌

సెల్‌టవర్‌ ఎక్కి డ్వాక్రా మహిళ ఆత్మహత్యాయత్నం

క్రమబద్ధీకరించుకోని లేఔట్లపై కఠిన చర్యలు
చంద్రబాబు సాధించిన ప్రగతి ఏమిటో చెప్పాలి
పోలీసుల అదుపులో లాటరీ విక్రేతలు

నిమ్మనపల్లె : నగదు వసూళ్ల కోసం తనను వేధిస్తూ అవమానించారని డ్వాక్రా మహిళ సెల్‌టవర్‌ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నిమ్మనపల్లె మండలంలో మంగళవారం జరిగింది. నిమ్మనపల్లెలోని దిగువవీధికి చెందిన షేక్‌ రియాజ్‌ భార్య షేక్‌ ఫర్జానా(35) స్థానిక మహిళా సమాఖ్యలోని బిందు స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిగా ఉంటోంది. స్థానికంగా కూలిపనులతో పాటు పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికురాలిగా పనిచేస్తూ జీవిస్తోంది. సంఘంలో బ్యాంకు లింకేజీ ద్వారా రూ.లక్ష, మరోవిడతగా రూ.30వేలు, పొదుపు రుణంగా రూ.50వేలు, విడతలవారీగా కుటుంబ అవసరాల కోసం తీసుకుంది. అయితే, దాదాపు ఏడాదికాలంగా రుణాలు చెల్లించలేదు. దీంతో మంగళవారం సీసీలు, గ్రూపు సభ్యులు, వెలుగు కార్యాలయంలో సమావేశమై రుణాలు తిరిగి చెల్లించే విషయమై ఫర్జానాను నిలదీశారు. ప్రస్తుతం బ్యాంకు అధికారులు కొత్తగా రుణాలు మంజూరు చేస్తున్నారని, పాత బకాయిలు చెల్లిస్తే కొత్త రుణాలు మంజూరవుతాయని, వెంటనే బకాయి చెల్లించాల్సిందిగా నిలదీశారు. ఫర్జానా మొండికేయడంతో బకాయిల చెల్లింపు కోరుతూ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అదే సమయంలో ఫర్జానా సైతం తనను రుణాలు చెల్లించాలని వేధించడమే కాకుండా, అవమానించారని చెపుతూ స్టేషన్‌లో మరో ఫిర్యాదు చేసింది. అక్కడి నుంచి నేరుగా దిగువవీధిలోని పోస్టాఫీసు సమీపంలో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌ సెల్‌టవర్‌ ఎక్కి ఆత్మహత్యా యత్నం చేసింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఎస్‌ఐ విష్ణునారాయణ సిబ్బందితో కలిసి అక్కడకు వెళ్లి బాధితురాలిని కిందకు దింపి కౌన్సిలింగ్‌ ఇచ్చి ఇంటికి పంపారు. ఈ విషయమై వెలుగు ఏపీఎం మురళీ మాట్లాడుతూ.. ఎస్‌హెచ్‌జీలో ఫర్జానా తీసుకున్న రుణాలు చెల్లించకపోవడంతో ఇతర సభ్యులు రుణం తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారన్నారు. బ్యాంకు అధికారులు, గ్రూపు సభ్యులు ఎంతగా చెప్పినా ఆమె రుణం చెల్లించలేదన్నారు.

కురవంక సర్పంచ్‌

చెక్‌పవర్‌ తాత్కాలిక రద్దు

మదనపల్లె రూరల్‌ : కురవంక సర్పంచ్‌ పసుపులేటి చలపతి చెక్‌పవర్‌ను తాత్కాలికంగా రద్దుచేస్తూ, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి ఏ.రాధమ్మ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. కురవంక గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజాప్రతినిధి అర్జీ అందజేశారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ముందస్తు అనుమతి, సంబంధిత బిల్లులు, ఓచర్లు లేకుండా గ్రామపంచాయతీ నిధులు డ్రా చేయడంపై సర్పంచ్‌ సంజాయిషీ కోరుతూ నోటీసులు జారీచేశామన్నారు. నిర్ణీత గడువులోపు బిల్లులు, ఓచర్లు సమర్పించకపోవడంతో చెక్‌ పవర్‌ను తాత్కాలికంగా రద్దుచేస్తూ ఉత్తర్వులిస్తున్నట్లు తెలిపారు. చెక్‌ పవర్‌ రద్దుపై వైఎస్సార్‌ సీపీ సర్పంచ్‌ పసుపులేటి చలపతి స్పందిస్తూ...రాజకీయ దురుద్దేశంతో తనను లక్ష్యంగా చేసుకుని కక్షసాధింపుల్లో భాగంగా చెక్‌పవర్‌ను తాత్కాలికంగా రద్దుచేయించినట్లు తెలిపారు. కురవంక పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్న మంజుల అవినీతి ఆరోపణలపై సస్పెండ్‌ అయిన నేపథ్యంలో పంచాయతీ రికార్డులన్నీ బీరువాలో పెట్టుకుని తాళం వేసుకుని వెళ్లిపోయారన్నారు. పంచాయతీ అధికారులు తనకు నోటీసు జారీచేసిన గడువు తేదీల్లో తనకు రికార్డులు ఇవ్వకపోవడంతో అధికారులకు అప్పగించలేకపోయానన్నారు. చెక్‌ పవర్‌ తాత్కాలిక రద్దుకు సంబంధించి హైకోర్టును ఆశ్రయించి న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు.

వంక పూడ్చివేతను అడ్డుకున్న గ్రామస్తులు

రైల్వేకోడూరు అర్బన్‌ : మండలంలోని రాఘవరాజపురం, ప్రధాన రహదారికి ఇరువైపులా భుములు కోట్లు విలువ పలుకుతున్నాయి,. దీనికితోడు ప్రభుత్వ భూములు, వంకపోరంబోకులు, ఆర్‌అండ్‌బి స్థలాలు, ఇరిగేషన్‌ భూములు అధికంగానే ఉన్నాయి. రాఘవరాజపురంలోని తిరుపతి– కడప ప్రధాన రహదారి పక్కన ప్రభుత్వ నర్సరీ సమీపంలోని వంకను కొందరు రాత్రి వేళ చదును చేస్తుంటే గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో వివాదం చెలరేగింది. విషయం తెలుసుకొన్న పోలీసులు అక్కడకు చేరుకొని జేసీబీ యంత్రాన్ని వెనక్కి పంపడంతో వివాదం సద్దుమణిగింది.

రైతు సేవ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు

గాలివీడు: రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ఉండాలన్న సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తుందని జిల్లా వ్యవసాయ అధికారి శివన్నారాయణ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని నూలివీడు గ్రామంలో నిర్వహించిన వరి పంటకోత ప్రయోగం, పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కనీస మద్దతు ధర గ్రేడ్‌ ఏ రకం క్వింటాల్‌ రూ. 2389, 75 కేజీలు రూ.1792, సాధారణ రకం క్వింటాల్‌ రూ.2369, 75 కేజీలు రూ.1777 నిర్ణయించినట్లు తెలిపారు.

‘విశ్వం’లో ఉచిత నవోదయ మోడల్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌

తిరుపతి సిటీ : స్థానిక వరదరాజ నగర్‌లోని విశ్వం విద్యా సంస్థలలో గురువారం ఉదయం 10 గంటలకు జవహర్‌ నవోదయ విద్యాలయ – 2026 పరీక్షకు సంబంధించి ఉచిత మోడల్‌ టెస్ట్‌ నిర్వహించనున్నట్లు విశ్వం విద్యాసంస్థల అధినేత, కోచింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌.విశ్వనాథ రెడ్డి తెలిపారు. 6వ తరగతి ప్రవేశానికి జాతీయ స్థాయిలో డిసెంబర్‌ 13వ తేదీన నిర్వహించే ప్రవేశ పరీక్షకు అనుగుణంగా ఈ నమూనా పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. ఈ నమూనా పరీక్ష ద్వారా విద్యార్థులు ప్రధాన పరీక్షకు సంసిద్ధం కావడంతో పాటు సబ్జెక్ట్‌ పరంగా లోపాలను సరిదద్దుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. నమూనా పరీక్షకు ఎలాంటి ప్రవేశ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. పరీక్షకు హాజరయే విద్యార్ధులు హాల్‌ టికెట్‌ (అడ్మిట్‌ కార్డ్‌) జిరాక్స్‌ కాపీని వెంట తీసుకురావాలని పేర్కొన్నారు. వివరాల కోసం 8688888802/ 9399976999 ఫోన్‌ నెంబర్లను సంప్రదించాలని సూచించారు.

మదనపల్లె : అనుమతిలేని లేఔట్లు, ఇంటినిర్మాణాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది, దీన్ని సద్వినియోగం చేసుకోని వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని పీకేఎం పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్‌ బీఆర్‌.సురేష్‌ పేర్కొన్నారు. మంగళవార స్థానిక కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే జనవరి 26 వరకు లేఔట్లు క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు, పలమనేరు, కుప్పం మున్సిపాలిటీ, 21 మండలాల పరిధిలో అనుమతిలేని లేఔట్లలో ప్లాట్లు కొన్న వారు ,స్థిరాస్తి వ్యాపారులు కూడా పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని సూచించారు. అనుమతిలేని లేఔట్లు, ఇంటి నిర్మాణాలను గుర్తించి నివేదికలు పంపాలని కమీషనర్లు, ఎంపీడీఓలను కోరామన్నారు. ఈ గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యాక తనిఖీలు నిర్వహిస్తామని, ఈలోగా క్రమబద్ధీకరించుకోని వాటికి నోటిసులు జారీచేసి కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బీపీఎస్‌ పథకాన్ని కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో కమిషనర్‌ కె.ప్రమీల, కార్యదర్శి పీఆర్‌.మనోహర్‌, కుప్పం చైర్మన్‌ సెల్వం, టౌన్‌బ్యాంక్‌ చైర్మన్‌ విద్యాసాగర్‌, డైరెక్టర్‌ రాటకొండ సోమశేఖర్‌, అధికారులు పాల్గొన్నారు.

రైల్వేకోడూరు అర్బన్‌ : అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో సాధించిన ప్రగతి ఏమిటో చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ప్రశ్నించారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు సంపద సృష్టిసా, అభివృద్ధి చేస్తా, సింగపూర్‌ చేస్తా అని చెప్పి ఈ 18 నెలల్లో నిరుద్యోగ సమస్యకై నా పరిష్కారం చూపారా అని నిలదీశారు. మెడికల్‌ కాలేజీలు, వాటి భూములు అమ్ముకొని పేద, బడుగు బలహీన వర్గాలకు మెడికల్‌ విద్య లేకుండా చేశారన్నారు. డబ్బు సంచులతో పోటీ పడేవారికి మెడికల్‌ విద్యను అమ్మకానికి పెట్టారని విమర్శించారు. ఆఖరికి కూటమి ప్రభుత్వాన్ని కూడా అమ్మకానికి పెట్టేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. వైద్య విద్య ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈనెల 18న ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు. చరిత్రను వక్రీకరిస్తూ వందేమాతరం గీతంపై అబద్దాలు చెబుతూ ప్రధాని మోదీ కాలం వెల్లబుచ్చుతున్నారని ఆరోపించారు.

కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి

ఓబులవారిపల్లె: ఏపీఎండీసీలో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య కోరారు. మంగళవారం ఏపీఎండీసీ కార్యాలయంలో సీపీఓ గోపినాథ్‌తో కార్మిక సంఘాల నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ ఏపీఎండీసీలో 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌, ట్రైనింగ్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలని కోరారు. మైనింగ్‌లో దాదాపు 60 లక్షల టన్నుల ఖనిజ నిక్షేపాలను వెలికి తీయాలన్నారు. ఏ గ్రేడ్‌ ముగ్గురాయి ఖనిజం టెండర్లను నిర్వహించాలని డిమాండ్‌ చేశారు ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు, ఏపీఎండీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి పోకూరు మురళీ, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గంగాధర్‌, సాంబశివ, సీపీఐ జిల్లా సెక్రటరీ మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్‌ కార్యాలయం ప్రారంభం

మదనపల్లె రూరల్‌ : మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి ప్రాంగణంలో మంగళవారం నూతనంగా నిర్మించిన ఔషధ నియంత్రణ తనిఖీ అధికారి(డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్‌) కార్యాలయం ప్రారంభమైంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ విజయవాడ నుంచి కార్యాలయ భవనాన్ని వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. డ్రగ్స్‌ నియంత్రణ కేంద్రం అడిషనల్‌ డైరెక్టర్‌ షేక్‌ ఆశా, జిల్లా ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌.కవిత శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...త్వరలో జనరిక్‌ ఔషధ కేంద్రాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. ఆస్పత్రి సమీపంలోని మందుల దుకాణాలపై నిత్యం పర్యవేక్షణ ఉండాలన్నారు. తరచూ మందుల దుకాణాలను తనిఖీ చేయాలన్నారు. కార్యక్రమంలో అనంతపురం డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్‌ కేశవరెడ్డి, మదనపల్లె డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్‌ దాదా ఖలందర్‌, మెడికల్‌ స్టోర్స్‌ అసోసియేషన్‌ జిల్లా సెక్రటరీ భూషణ్‌ గుప్తా, మదనపల్లె కార్యదర్శి శ్రీధర్‌, కోశాధికారి బాలాజీ, సభ్యులు మురళీ, సత్యప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

జాతీయ స్థాయి పోటీలకు సుండుపల్లె విద్యార్థులు

సుండుపల్లె : ఎస్‌జీఎఫ్‌ఐ జాతీయ స్థాయిలో నిర్వహించే బేస్‌బాల్‌, సాఫ్ట్‌బాల్‌ క్రీడలకు సుండుపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాల, జూనియర్‌ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. చిత్తూరు జిల్లా పలమనేరులోని జెడ్పీ ఉర్దూ ఉన్నత పాఠశాలలో గత నెల 29 నుంచి ఈ నెల 1వ తేదీ వరకు జరిగిన అండర్‌–14 బేస్‌బాల్‌ రాష్ట్ర స్థాయి పోటీలలో జెడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న కోసిక నాగచైతన్య, గుంటూరు జిల్లా చుండూరు మండలం మోదకూరులో జరిగిన పోటీలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న నందాల్య బేబి, కె.వెంకటేశ్వర్లు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ రాధారాణి తెలిపారు.

మదనపల్లె రూరల్‌ : పట్టణంలో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలను దోపిడీకి గురిచేస్తూ, గుట్టుచప్పుడు కాకుండా లాటరీ టికెట్లు విక్రయిస్తున్న 15 మందికి పైగా పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నారు. రెండు రోజులుగా జరుగుతున్న రహస్య విచారణకు సంబంధించి పోలీసులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అయితే అదుపులోకి తీసుకున్న వ్యక్తులకు సంబంధించి కుటుంబ సభ్యు లు డీఎస్పీ కార్యాలయం వద్ద వేచి చూస్తున్నారు. లాటరీ టికెట్ల విక్రేతలకు అధికార పార్టీ నాయకుల అండదండలు పుష్కలంగా ఉండటంతో కేసు నుంచి తప్పించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పట్టణంలోని అన్ని ప్రాంతాల నుంచి పోలీసులు ప్రత్యేకంగా గాలించి విక్రేతలను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్‌ లాటరీ టికెట్ల విక్రయాలకు సంబంధించి లోతుగా దర్యాప్తుగా చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై డీఎస్పీ మహేంద్రను విచారించగా, కొంతమంది లాటరీ విక్రేతలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. విక్రయాలకు సంబంధించి ముఖ్య వ్యక్తుల సమాచారం కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు.

సెల్‌టవర్‌ ఎక్కి డ్వాక్రా మహిళ ఆత్మహత్యాయత్నం1
1/7

సెల్‌టవర్‌ ఎక్కి డ్వాక్రా మహిళ ఆత్మహత్యాయత్నం

సెల్‌టవర్‌ ఎక్కి డ్వాక్రా మహిళ ఆత్మహత్యాయత్నం2
2/7

సెల్‌టవర్‌ ఎక్కి డ్వాక్రా మహిళ ఆత్మహత్యాయత్నం

సెల్‌టవర్‌ ఎక్కి డ్వాక్రా మహిళ ఆత్మహత్యాయత్నం3
3/7

సెల్‌టవర్‌ ఎక్కి డ్వాక్రా మహిళ ఆత్మహత్యాయత్నం

సెల్‌టవర్‌ ఎక్కి డ్వాక్రా మహిళ ఆత్మహత్యాయత్నం4
4/7

సెల్‌టవర్‌ ఎక్కి డ్వాక్రా మహిళ ఆత్మహత్యాయత్నం

సెల్‌టవర్‌ ఎక్కి డ్వాక్రా మహిళ ఆత్మహత్యాయత్నం5
5/7

సెల్‌టవర్‌ ఎక్కి డ్వాక్రా మహిళ ఆత్మహత్యాయత్నం

సెల్‌టవర్‌ ఎక్కి డ్వాక్రా మహిళ ఆత్మహత్యాయత్నం6
6/7

సెల్‌టవర్‌ ఎక్కి డ్వాక్రా మహిళ ఆత్మహత్యాయత్నం

సెల్‌టవర్‌ ఎక్కి డ్వాక్రా మహిళ ఆత్మహత్యాయత్నం7
7/7

సెల్‌టవర్‌ ఎక్కి డ్వాక్రా మహిళ ఆత్మహత్యాయత్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement