హత్యాయత్నం కేసులో రెండేళ్ల జైలు
సిద్దవటం : సిద్దవటం పోలీస్ స్టేషన్ పరిధిలో 2018 సంవత్సరంలో జరిగిన హత్యా యత్నం కేసులో నిందితుడికి రెండేళ్ల సాధారణ జైలుశిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ బద్వేలు ఏఎస్‌జే కోర్టు జడ్జి వైజే ప్రద్మశ్రీ మంగళవారం తీర్పు వెలువరించారు. సిద్దవటం ఎస్‌ఐ మహమ్మద్‌రఫీ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహించే తిమ్మిరి సుదర్శన్ రోడ్‌సేఫ్టీ డ్యూటీలో భాగంగా భాకరాపేట సమీపంలోని కడప–తిరుపతి జాతీయ రహదారి వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. మండలంలోని మిట్టపల్లి గ్రామానికి చెందిన కుమ్మితి సతీష్ అనే వ్యక్తి పీ 04 బీటీ 3032 అనే నంబర్ గల మోటార్ సైకిల్‌పై వస్తుండటం గమనించి 50 మీటర్ల దూరంలో వాహనాల తనిఖీ నిమిత్తం మోటారు సైకిల్ ఆపమని ఏఎస్‌ఐ కోరారు. కానీ అతను ద్విచక్రవాహనాన్ని ఆపకుండా తప్పించుకొని పోవాలనే ఉద్దేశంతో మోటార్‌సైకిల్‌ను అతివేగంగా, అజాగ్రత్తగా నడిపి ఏఎస్‌ఐను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఏఎస్‌ఐ తిమ్మిరి సుదర్శన్ ఎడమ కాలు విరిగింది. ఈ మేరకు అప్పట్లో సిద్దవటం పోలీస్ స్టేషన్‌లో క్రైం నెంబర్ 137/2018, అండర్ సెక్షన్ 308, 332 ఐపీసీ కింద కేసు నమోదు చేసి విచారణ చేశారు. సదరు కేసును బద్వేలు ఏఎస్‌జే కోర్టు జడ్జి వైజే పద్మశ్రీ విచారణ జరిపారు. నిందితుడిపై నేర నిరూపణ కావడంతో ఈమేరకు శిక్ష విధించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ డీవీ శిరామకృష్ణ వాదనలు వినిపించి నేరస్తునికి శిక్ష పడేవిధంగా కృషి చేశారు. సాక్ష్యాధారాలతో నేరం రుజువు చేిసి శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బంది, కోర్టు కానిస్టేబుళ్లు కిషోర్‌బాబు, మల్లికార్జునలను వైఎస్‌ఆర్ కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ అభినందించారు.


