ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి మృతి
మదనపల్లె రూరల్ : ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. మండలంలోని సీటీఎం పంచాయతీ మిట్టపల్లెకు చెందిన గోపాల్‌రెడ్డి కుమారుడు రవీంద్రరెడ్డి(40) బి.కొత్తకోట మండలం గొల్లపల్లెకు చెందిన భార్గవిని వివాహం చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత అదే మండలంలోని ఎగువ భూంపల్లెకు చెందిన రూపను రెండో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత అదే మండలానికి చెందిన వివాహిత రమణమ్మతో సహజీవనం చేశాడు. ఆమెతో కలిసి మదనపల్లెలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో కుటుంబ బాధ్యతలు పట్టించుకోకుండా జులాయిగా తిరుగుతూ వ్యసనాలకు బానిస అయ్యాడు. ఈ క్రమంలో రమణమ్మ నగలు తీసుకెళ్లి ఖర్చు చేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మనస్తాపానికి గురైన రవీంద్రరెడ్డి సోమవారం ఈశ్వరమ్మకాలనీ రైస్‌మిల్లు వద్ద మద్యంలో పురుగుమందు కలుపుకుని తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు సీఐ కళావెంకటరమణ తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. మృతుడి తండ్రి గోపాల్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.


