పోలీసుల కుటుంబాలకు ఆరోగ్య భరోసా
రాయచోటి : అన్నమయ్య జిల్లా పోలీసులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ యూనిట్ వెల్ఫేర్ ఆసుపత్రిని ఎస్పీ లాంఛనంగా ప్రారంభించారు. పోలీసు సంక్షేమమే జిల్లా పోలీసు శాఖకు ప్రథమ బాధ్యత అని స్పష్టం చేశారు. పోలీసులు వారి కుటుంబాలకు నాణ్యమైన, ఉచిత వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అన్ని రకాల ప్రాథమిక వైద్య సదుపాయాలు, అవసరమైన మందులు ఉచితంగా అందుబాటులో ఉంటాయన్నారు. తరచుగా ఒత్తిడికి గురయ్యే సిబ్బందికి భవిష్యత్తులో మానసిక ఆరోగ్య కౌన్సిలింగ్ సేవలు కూడా అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రి ఏర్పాటుకు సహకరించిన డీఎంహెచ్‌ఓ, రాయచోటి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ లక్ష్మీ ప్రసాద్‌కు ఎస్పీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రారంభంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి, రాయచోటి ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డి.లక్ష్మీ ప్రసాద్, డాక్టర్లు రామరాజు, రాధిక, అబ్దుల్ లతీఫ్, ఏఏఓ జె.త్రినాథసత్యం, పలువురు సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, డీపీఓ సిబ్బంది, మహిళా పోలీసులు, హోంగార్డులు, పోలీసు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


