ప్రవాసాంధ్రుల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం
రాజంపేట : ప్రవాసాంధ్రుల సమస్యలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో జరిగినంత మేలు ఇప్పుడు జరగడం లేదని వైఎస్సార్‌సీపీ కువైట్ ప్రధాన సలహాదారుడు టి.దుర్గారెడ్డి విమర్శించారు. మంగళవారం వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్, ఎన్‌ఆర్‌ఐ గ్లోబల్ కన్వీనర్ సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడి విలేకరులతో మాట్లాడుతూ 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీఎన్‌ఆర్టీని బలోపేతం చేశారన్నారు. దాని ద్వారా అనేక విధాలుగా గల్ఫ్ బాధితులను ఆదుకున్నారన్నారు. రాజంపేట కేంద్రంగా ఏపీఎన్‌ఆర్టీ విభాగాన్ని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఇప్పుడున్న చంద్రబాబు ప్రభుత్వం ప్రవాసాంధ్రుల విషయంలో ప్రకటనలకే పరిమితమైందన్నారు. 2029లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకుంటేనే గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు మార్గం సుగమమవుతుందన్నారు. కార్యక్రమంలో గల్ఫ్ వైఎస్సార్‌సీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


