అంతర్జాతీయ సైబర్‌ ముఠా గుట్టురట్టు | - | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ సైబర్‌ ముఠా గుట్టురట్టు

Dec 2 2025 8:12 AM | Updated on Dec 2 2025 8:30 AM

రాయచోటి : అన్నమయ్య జిల్లా మదనపల్లి కేంద్రంగా డిజిటల్‌ అరెస్ట్‌, ఫేక్‌ సీబీఐ, ఈడీ అధికారుల అవతారమెత్తి భారీ మోసాలకు పాల్పడుతున్న అంరత్జాతీయ సైబర్‌ నేరస్తుల ముఠాగుట్టును మదనపల్లె ఒన్‌టౌన్‌ పోలీసులు రట్టు చేశారు. సైబర్‌ నేర ముఠా కేసుకు సంబంధించి జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో మీడియాకు వివరాలను వెల్లడించారు. మదనపల్లికి చెందిన 75 ఏళ్ల రిటైర్డ్‌ మేల్‌ నర్స్‌ రేపురి బెంజిమెన్‌ను లక్ష్యంగా చేసుకున్న ముఠా అతని పాన్‌కార్డ్‌ను వాడుకొని అకౌంట్స్‌ను ఓపెన్‌ చేశారు. ఢిల్లీలో మీ పేరు మీద సీబీఐ, ఈడీ కేసు నమోదైంది. మీ అకౌంటులో రూ.48 లక్షలు డబ్బులు పడ్డాయి అంటూ రిసిప్ట్‌ పంపారు. వెంటనే రూ.48 లక్షలు డబ్బులు రీఫండ్‌ చేయాలని చేయకపోతే మా వాళ్లు మీ పక్కనే ఉన్నారు. అరెస్ట్‌ చేసి ఢిల్లీకి తీసుకెళ్తారు.. అంటూ ఈ ఏడాది జులై 25వ తేదీన భయబ్రాంతులకు గురిచేసి డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో భయపెట్టి రూ.48 లక్షలు కాజేసినట్లు ఎస్పీ వివరించారు. ఈ కేసులో అన్ని కోణాల్లో విచారణ చేసిన పోలీసులు సోమవారం రాయచోటిలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో కీలక నిందితులుగా ఉన్న పఠాన్‌ ఇంతియాజ్‌ఖాన్‌, షేక్‌ అమీన్‌, షేక్‌ అర్షాద్‌లను పోలీసులు అరెస్టు చేశారన్నారు.

స్వాధీనం చేసుకున్న వస్తువులు..

అరెస్టు చేసిన నిందితుల నుంచి రూ.32 లక్షలు నగదు, 25 ఏటీఎం కార్డులు, 3 మొబైల్‌ పోన్లు, 4 సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. అదనంగా ఖాతాల్లో ఉన్న రూ.7.65 లక్షలను ఫ్రీజ్‌ చేశామన్నారు.

మోసం ఇలా..

నిందితులు కాంబోడియా–కువైట్‌ కేంద్రంగా ఈ అంతర్జాతీయ రాకెట్‌ను నడిపిస్తున్నట్లు విచారణలో బయటపడిందన్నారు. అమాయక ప్రజలకు వీడియో కాల్స్‌ చేసి ‘‘మీ పేరుపై డ్రగ్స్‌ కేసులు, ఫేక్‌ ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయి’’ అని సీబీఐ, ఈడీ అధికారులమంటూ భయబ్రాంతులకు గురిచేస్తారన్నారు. ‘డిజిటల్‌ అరెస్ట్‌’ పేరుతో బాధితుల నుంచి భారీ మొత్తంలో డబ్బును వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయించుకుంటారు. డబ్బు పడిన వెంటనే ఏటీఎంల ద్వారా విత్‌డ్రా చేసి, సీడీఎం మెషీన్ల ద్వారా ఇతర ఖాతాలకు మళ్లిస్తూ, వాట్సాప్‌ సాక్ష్యాలను వెంటనే చెరిపివేస్తున్నట్లు ఎస్పీ వివరించారు.

సాంకేతిక నిఘా ఆధారంగా మదనపల్లి డీఎస్పీ యస్‌.మహేంద్ర ఆధ్వర్యంలో 1వ పట్టణ సీఐ మహమ్మద్‌రఫీ, ఎస్‌ఐలు అన్సర్‌బాషా, శివకుమార్‌, పోలీ సు సిబ్బంది, సైబర్‌ సెల్‌ సిబ్బంది హవాలా ద్వారా డబ్బులు ఎలా బదిలీ చేస్తున్నారో గుర్తించి చాకచక్యంగా వ్యవహరించి ముగ్గురు నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులను అరెస్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన పోలీసు అధికారులను, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

అప్రమత్తంగా ఉండాలి..

● సైబర్‌ నేరగాళ్లు ‘‘డిజిటల్‌ అరెస్ట్‌’’ అనే కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారని, ప్రజలు ఈ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ముఖ్యంగా పదవీ విరమణ పొందిన ఉద్యోగులను, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని నేరగాళ్లు డబ్బులు దోచుకుంటున్న విషయాన్ని గుర్తు చేశారు.

● సైబర్‌ నేరగాళ్లు తాము పోలీస్‌, సీబీఐ, ఈడీ, లేదా నార్కోటిక్స్‌ అధికారులమని ఫోన్‌ చేస్తారు. వీడియో కాల్‌లో యూనిఫాం ధరించి, వెనుక పోలీస్‌ స్టేషన్‌ సెటప్‌ లాంటివి సృష్టించి నమ్మేలా చేస్తారు.

● మీ ఆధార్‌కార్డు నకిలీ పాస్‌పోర్ట్‌ల కోసం వాడబడింది లేదా మీ బ్యాంక్‌ ఖాతాలో హవాలా డబ్బు ఉంది అని అబద్దాలు చెప్పి తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తారు.

● విచారణ పేరుతో మిమ్మల్ని వీడియో కాల్‌లోనే ఉంచి, ఇంటి నుండి బయటకు వెళ్లకూడదని, ఎవరితోనూ మాట్లాడకూడదని డిజిటల్‌ అరెస్ట్‌ చేశామని బెదిరిస్తారు.

● కేసు నుండి బయటపడాలంటే వెరిఫికేషన్‌ కోసం డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చేయాలని ఒత్తిడి చేస్తారు.

చట్టంలో ‘డిజిటల్‌ అరెస్ట్‌’ లేదు..

● భారతీయ చట్టాల ప్రకారం ఏ దర్యాప్తు సంస్థ (పోలీస్‌, సీబీఐ, ఈడీ) వీడియో కాల్‌ ద్వారా అరెస్ట్‌ చేయరు. డిజిటల్‌ అరెస్ట్‌ అనేది పూర్తిగా బూటకం.

● ఏ ప్రభుత్వ విచారణ సంస్థ ఆన్‌లైన్‌లో డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చేయమని, బ్యాంక్‌ వివరాలు ఇవ్వమని అడగదు.

● అపరిచితులు వీడియో కాల్స్‌ చేస్తే లిఫ్ట్‌ చేయకండి. మీ ఆధార్‌, ఓటీపీ, బ్యాంక్‌ పిన్‌ నంబర్లను ఎవరితోనూ పంచుకోవద్దు.

● మీరు దాచుకున్న పదవీ విరమణ సొమ్ముపైనే నేరగాళ్ల కన్ను పడింది. మీకు వచ్చే ఇలాంటి బెదిరింపు ఫోన్‌కాల్స్‌ పట్ల ఆందోళన చెందవద్దు. వారు మిమ్మల్ని ఎంత భయపెట్టినా వెంటనే ఫోన్‌ కట్‌ చేయండి.

● మీరు మోసపోయినట్లు అనుమానం వస్తే వెంటనే 1930 నంబర్‌కి కాల్‌ చేయండి లేదా వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయండి. దగ్గరలోని పోలీస్‌స్టేషన్‌ను సంప్రదించండి.

అవగాహన పోస్టర్ల ఆవిష్కరణ..

సైబర్‌ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలతో ప్రజలను మోసం చేస్తున్న ‘డిజిటల్‌ అరెస్ట్‌’ విధానంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీస్‌ శాఖ రూపొందించిన ప్రత్యేక వాల్‌పోస్టర్లను సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి, మదనపల్లి డీఎస్పీ ఎస్‌.మహేంద్ర, మదనపల్లి 1వ పట్టణ సీఐ మహమ్మద్‌రఫీ, సైబర్‌ సెల్‌ సీఐ మహమ్మద్‌ ఆలీ, ఎస్‌ఐలు, అన్సర్‌బాషా, శివకుమార్‌, పోలీసు సిబ్బంది, సైబర్‌ సెల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో మోసాలకు

పాల్పడుతున్న ముగ్గురు నిందితుల అరెస్టు

సీబీఐ, ఈడీ అధికారులమంటూ వృద్ధుడి నుంచి రూ.48 లక్షలు కాజేసిన కేటుగాళ్లు

నిందితుల నుంచి రూ.32 లక్షల నగదు, 25 ఏటీఎం కార్డులు స్వాధీనం

మీడియాకు వివరాలు వెల్లడించిన

జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement