బెల్టుషాపుపై పోలీసుల దాడి
గుర్రంకొండ : బెల్టుషాపులపై పోలీసులు దాడులు నిర్వహించి ఓ మద్యం విక్రేత నుంచి 32 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకొన్న సంఘటన మండలంలోని టి.పసలవాండ్లపల్లె పంచాయతీ టి.గొల్లపల్లె క్రాస్‌లో జరిగింది. ఆదివారం రాత్రి స్థానిక ఓ డాబాలో మద్యం విక్రయిస్తున్నారనే సమాచారం అందుకొన్న పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఓ దుకాణంలో అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్న 32 క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకొన్నట్లు ఎస్‌ఐ బాలకృష్ణ తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ దాడిలో ఏఎస్‌ఐలు గజేంద్ర, బొజ్జానాయక్, సిబ్బంది పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
మహిళకు తీవ్ర గాయాలు
రైల్వేకోడూరు అర్బన్ : రోడ్డు దాటుతున్న మహిళను గుర్తు తెలియని కారు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని రాఘవరాజపురం వద్ద ప్రధాన రహదారిపై బంధువులు ఉన్నారని సోమవారం బాల్‌రెడ్డిపల్లికి చెందిన శిరిగిరి భాస్కర్ రెడ్డి భార్య గంగమ్మ రోడ్డు దాటే ప్రయత్నం చేసింది. ఇంతలో వేగంగా వచ్చిన గుర్తు తెలియని కారు ఆమెను ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బంధువులు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కారు దగ్ధం
కడప అర్బన్ : కడప నగరంలోని శంకరాపురంలో ఓ కారు విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో సోమవారం దగ్ధమైంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. దాదాపు రూ. 2..50 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు ఫిర్యాదు చేసినట్లు కడప అగ్నిమాపక శాఖ జిల్లా సహాయ అధికారి యోగీశ్వర్ రెడ్డి తెలిపారు.
పీజీ వైద్య విద్యార్థినికి
గోల్డ్ మెడల్
కడప అర్బన్ : డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పీజీ పరీక్షల్లో కడప ప్రభుత్వ వైద్యకళాశాల (రిమ్స్) అనస్థీషియా విభాగానికి చెందిన పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థిని డాక్టర్ ఎం. సంధ్యారాణి అత్యధిక మార్కులు(637/800) సాధించారు. దీంతో ఆమె యూనివర్సిటీ గోల్డ్ మెడల్‌కు ఎంపికై నట్లు కడప మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ జమున తెలిపారు. డాక్టర్ ఎం.సంధ్యారాణిని ప్రిన్సిపాల్‌తో పాటు వైస్ ప్రిన్సిపాల్, మైక్రోబయాలజీ హెచ్‌ఓడీ డాక్టర్ నాగశ్రీలత, అనస్తీషియా డాక్టర్ సునీల్ చిరువెళ్ల, వైద్యులు, వైద్య విద్యార్థులు అభినందించారు.
బెల్టుషాపుపై పోలీసుల దాడి
బెల్టుషాపుపై పోలీసుల దాడి


