అంతర్ జిల్లా హుండీ దొంగలు అరెస్టు
గుర్రంకొండ : చిత్తూరు, అన్నమయ్య జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలోని దేవాలయాల్లో హుండీ దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 78 వేలు విలువచేసే వస్తువులు, నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు మదనపల్లె మండలం కొత్తవారిపల్లె పంచాయతీ బూసేపల్లె గ్రామానికి చెందిన ఎదుర్ల బాలాజి(45), నిమ్మనపల్లె కస్పా కోళ్లఫారం కాలనీకి చెందిన ఎస్.బాలు(20), చిత్తూ రు జిల్లా పెద్దపంజాని మండలం రాయలపేట గ్రామానికి చెందిన కొరువు రమేష్(29) అనే వ్యక్తు లు గత కొంతకాలంగా రెండు జిల్లాల్లోని దేవాలయాల్లో హుండీల దొంగతనాలకు పాల్పడ్డారు. ఇటివల జిల్లాలోని వాయల్పాడు, రామాపురం, లక్కిరెడ్డిపల్లె పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు దేవాలయాల్లో హుండీ దొంగతనాలకు పాల్పడ్డారు. అప్పట్లో వీరిపై ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. ఈనేపథ్యంలో సోమవారం మండలంలోని అమిలేపల్లె క్రాస్ వద్ద అనుమానాస్పదంగా వీరు తిరుగుతుండగా వాల్మీకీపురం సీఐ రాఘవరెడ్డి, గుర్రంకొండ ఎస్‌ఐ బాలకృష్ణల ఆధ్వర్యంలోని పోలీసుల బృందం వారి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 250 గ్రాముల వెండి , 25 కేజీల కాపర్‌వైర్లు, రూ. 10వేలు మొత్తం రూ. 78 వేలు విలువ చేసే వస్తువులు, నగదు రికవరీ చేసినట్లు ఎస్‌ఐ బాలకృష్ణ తెలిపారు.


