స్టాంపుల కొరత.. వినియోగదారుల వెత
పుల్లంపేట : మండలంలో రిజిస్ట్రేషన్ స్టాంపుల కొరతతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు నెల రోజులుగా స్టాంపులు లేకపోవడంతో రిజిస్ట్రేషన్‌లు ఆగిపోతున్నాయి. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, పుల్లంపేట మండలాల నుంచి ప్రతిరోజూ దాదాపు 20 నుంచి 30 రిజిస్ట్రేషన్లు జరిగేవి. మార్కెట్ వాల్యూలు సంబంధిత అధికారుల నుంచి తీసుకొని చలాన్‌లు చెల్లించి రిజిస్ట్రేషన్‌కు వెళితే తీరా స్టాంపులు లేకపోవడంతో వినియోగదారులు నిరాశతో వెనుతిరుగుతున్నారు. రాజంపేట తదితర ప్రాంతాల్లో అధిక ధరలు చెల్లించి స్టాంపులు కొనుగోలు చేయలేక కేవలం అగ్రిమెంట్‌లకే పరిమితమవుతున్నారు. ఇదిలా ఉండగా కామన్ సర్వీస్ సెంటర్‌లలో గతంలో ఈ–స్టాంపులు విరివిగా లభించేవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కామన్ సర్వీస్ సెంటర్‌లకు ఈ–స్టాంపులు పంపిణీ చేసిన దాఖలాలు లేవని సర్వీస్ సెంటర్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా విద్యార్థులు వివిధ సర్టిఫికెట్ల కోసం ఇబ్బందులు పడుతున్నారు. స్టాంపుల కొరతతో స్టాంపు రైటర్‌లకు పనిలేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని స్టాంపులు సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.


