భూ స్వాధీనం అంటూ రెవెన్యూ అధికారుల హల్‌చల్.!
సంబేపల్లె : మండల పరిధిలోని దేవపట్ల గ్రామంలో ఇతరుల వద్ద నుంచి వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు కొనుగోలు చేసిన భూమి ప్రభుత్వ భూమి అని, దానిని స్వాధీనం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయని రెవెన్యూ అధికారులు సోమవారం హల్‌చల్ చేశారు. మధ్యాహ్నం సంబంధిత భూమి వద్దకు సిబ్బందితో సహా చేరుకున్న సంబేపల్లె తహసీల్దార్ సుబ్రమణ్యం రెడ్డి భూమి చుట్టూ ఉన్న కంచెను జేసీబీ యంత్రాలతో తొలగించేందుకు సిద్ధమయ్యారు. అందుకోసం జేసీబీ యంత్రాలను రప్పించారు. సంఘటనా స్థలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రాయచోటి రూరల్ సీఐ వరప్రసాద్ ఆధ్వర్యంలో సంబేపల్లె, చిన్నమండెం, వీరబల్లి, సుండుపల్లె మండలాల ఎస్‌ఐలు బందోబస్తు నిర్వహించారు. తహసీల్దార్ సుబ్రమణ్యం రెడ్డి స్వాధీనం చేసుకోవాలని జేసీ ఆదేశించిన మేరకు ఆ భూమిలో స్వాధీన బోర్డులు ఏర్పాటు చేశారు. చివరకు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో భూ యజమానులకు అనుకూలంగా హైకోర్టు స్టే రావడంతో అక్కడున్న రెవెన్యూ అధికారులు, పోలీసు సిబ్బంది వెనుదిరిగి వెళ్లారు. అయితే అధికారుల భూ స్వాధీనం వెనుక కూటమి నాయకుల ఒత్తిడి తీవ్రంగా ఉందనే విషయం మండలంలో చర్చనీయాంశంగా మారింది.


