వైఎస్సార్‌సీపీ పాలనలో రాయచోటి.. అభివృద్ధిలో మేటి
● అభివృద్ధి జరగలేదని మాట్లాడటం అవివేకం
● 6 నియోజకవర్గాలతో అన్నమయ్య జిల్లా ఏర్పాటు చేసిన వైఎస్ జగన్
● 3 నియోజకవర్గాలకు కుదించి బలహీన పరిచిన చంద్రబాబు ప్రభుత్వం
● అవినీతి, ఆక్రమణలు జరిగివుంటే రుజువు చేయండి
● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి
రాయచోటి అర్బన్ : వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాయచోటిలో అభివృద్ధి శూన్యమని కొందరు మాట్లాడటం వారి అవివేకానికి నిదర్శనమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో రాయచోటిలో అభివృద్ధి జరగలేదన్న రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి విమర్శలపై శ్రీకాంత్‌రెడ్డి స్పందిస్తూ ఆదివారం పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేశారు. అభివృద్ధే ధ్యేయంగా, ఈ ప్రాంత శ్రేయస్సే లక్ష్యంగా, పురోగతే ఊపిరిగా అధికారంలో ఉన్న ఐదేళ్లూ పని చేశామని ఆయన గుర్తుచేశారు. తాము చేసిన అభివృద్ధిని ఆధారాలతో సహా చూపుతామన్నారు. ప్రతి సారి భూ ఆక్రమణలపై మాట్లాడుతున్న వారు అధికారంలోకి వచ్చి 18 నెలలు అయ్యిందని, వారు చెప్పినట్లు వినే అధికారులు కూడా ఉన్నారని, వారితోనే విచారణ చేయించి రాజకీయ ఆరోపణలు కాకుండా రుజువులు చూపి వెంటనే స్వాధీనం చేసుకోవాలని సూచించారు. పేద ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశంతో అనేక చట్టాలను ప్రభుత్వం తీసుకువచ్చిందని, చుక్కల భూములు పారదర్శకంగా ఆ రైతులకే చెందాలని, 20 ఏళ్లు అనుభవం ఉన్న వాటిని వారికే అందించాలన్న ఉద్దేశంతో అసైన్‌మెంట్ పట్టాలు ఇచ్చేందుకు గతంలో మంచి నిర్ణయాలు తీసుకున్న విషయాలు గుర్తుచేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎక్కడ వైఎస్సార్‌సీపీకి మంచిపేరు వస్తుందోనని కాలయాపన చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే రాయచోటికి రింగురోడ్డుతోపాటు పట్టణానికి శాశ్వత తాగునీటి సమస్యను తీర్చడానికి ఎంతో కృషి చేశామని తెలిపారు.
రాయచోటిలో జరిగిన ప్రధాన అభివృద్ధి పనులు
అన్నమయ్య జిల్లా ఏర్పాటు సమయంలో శాసీ్త్రయంగా జరగలేదని మాట్లాడిన వారే... అది భౌగోళికంగా ఉన్నందున జిల్లా కేంద్రం వచ్చిందని మాట్లాడారని పేర్కొన్నారు. అప్పుడు విమర్శలు చేసిన వారు ఇప్పుడు ద్వంద్వ వైఖరితో మాట్లాడుతూ గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. 6 నియోజకవర్గాలతో అన్నమయ్య జిల్లా చేసిన ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిది అయితే విభజించడమే లక్ష్యంగా పని చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. కేవలం 3 నియోజకవర్గాలతో జిల్లాను చేయడం బాధాకరమన్నారు. దీనివల్ల రాయచోటి ప్రాధాన్యత చాలా వరకు తగ్గిపోయిందన్నారు. కలెక్టర్ బంగ్లా ఏర్పాటైనా, మీరు అనునిత్యం కూర్చుండే స్టేట్ గెస్ట్ హౌస్ మిగితా జిల్లాల కంటే ముందుగా అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యోగి వేమన యూనివర్సిటీకి 100 ఎకరాలు, కలెక్టర్ బంగ్లాకు 5 ఎకరాలు, జేసీ బంగ్లాకు 2 ఎకరాలు, ఎస్పీ బంగ్లాకు 1.5 ఎకరాలు, స్టేట్ గెస్ట్ హౌస్‌కు 2 ఎకరాలు, డీఎస్పీ కార్యాలయానికి ఒక ఎకరా, కేంద్రీయ విశ్వవిద్యాయం కోసం 5 ఎకరాలు, ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు 0.50 ఎకరాలు, నగరవనానికి 80 ఎకరాలు, క్రికెట్ స్టేడియం కోసం 29 ఎకరాలు, శిల్పారామం కోసం 12 ఎకరాలు, జిల్లా పరిషత్ కార్యాలయం కోసం 10 ఎకరాలు, సెరికల్చర్ కార్యాలయంలో నిరుపయోగంగా ఉన్న స్థలాన్ని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు కేటాయింపు, టీటీడీ కల్యాణ మండపం కోసం 1.5 ఎకరాలు, ఆర్టీసీ బస్టాండ్‌కు 0.33 ఎకరాల రెవెన్యూ భూమిని కేటాయించడం జరిగిందన్నారు. నారాయణరెడ్డిగారిపల్లె వద్ద జగనన్న కాలనీ కోసం 200 ఎకరాలు కేటాయించి 6 వేల మందికి పక్కా ఇళ్లు ఇచ్చామన్నారు. అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా జగనన్న కాలనీలలో పేదలకు ఇళ్లు, వంద పడకల ఆసుపత్రి, రైతు బజార్, మున్సిపల్ సభాభవనం, అర్బన్ హెల్త్ సెంటర్లు, డైట్ మున్సిపల్ పార్కు, ఎంపీడీఓ కార్యాలయం, రహదారుల విస్తరణ వంటి వైఎస్ జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు రాయచోటిలో కనిపిస్తూనే ఉన్నాయని తెలిపారు. 950 పల్లెలకు తాగునీటిని అందించే లక్ష్యంతో జలజీవన్ మిషన్‌కు రూ.2700 కోట్ల నిధులు మంజూరు అయ్యింది కూడా వైఎస్సార్‌సీపీ హయాంలోనేనని పేర్కొన్నారు. అలాగే శిబ్యాల గ్రామపరిధిలో పరిశ్రమల కోసం 500 ఎకరాలు వైఎస్సార్‌సీపీ హయాంలో కేటాయిస్తే, ఇలాంటి వాటికి కూడా ఇప్పుడు కొత్తగా రిబ్బన్ కట్ చేయడం దారుణమన్నారు. ఈ 18 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం చేసింది కేవలం క్రిటికల్ కేర్ యూనిట్ ఒక్కటేనని తెలిపారు. ఇవన్నీ ఇలా ఉంటే అధికారం ఉంది కదా అని హేళన చేయడం, బూతు పదాలతో మాట్లాడటం సంస్కారం కాదని, అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. కానీ తాము అధికారంలో ఉన్నప్పుడు విమర్శలు కాకుండా కేవలం అభివృద్ధి కోసం మాత్రమే తాపత్రయ పడి, ఆ విధంగానే రాయచోటలో ప్రగతి పనులు చేశామన్నారు.
వైఎస్సార్‌సీపీ సోషియల్ మీడియాపై..
ప్రభుత్వ వైఫల్యాలను సామాన్యుడు ప్రశ్నిస్తే పోలీసులు జ్యోకం చేసుకుని బెదిరించడం, హింసించడం చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనిపిస్తోందని శ్రీకాంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోషియల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను స్టేషన్‌కు పిలిపించి కొట్టడం, హింసించడం సమంజసం కాదన్నారు. అన్యాయాలకు పాల్పడుతున్న అధికారులను తాము గుర్తుకు పెట్టుకుంటామని ఆయన పేర్కొన్నారు.


