యువకుడి ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : తల్లిదండ్రులు మందలించారని యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం పుంగనూరు మండలంలో జరిగింది. కమ్మవారిపల్లె ఇరుకువారి ఇండ్లుకు చెందిన బుడ్డన్న కుమారుడు నరేష్(18) చదువు మానేసి ఇంటి వద్దే పనులు చేసుకుంటున్నాడు. ఆదివారం సక్రమంగా పనులు చేయడం లేదని తల్లిదండ్రులు నరేష్‌ను మందలించారు. దీంతో మనస్తాపం చెంది ఇంటి వద్ద పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్సల అనంతరం మెరుగైన వైద్యం కోసం బాధితుడిని తిరుపతికి రెఫర్ చేశారు.
కారు ఢీకొని వృద్ధుడికి గాయాలు
మదనపల్లె రూరల్ : గుర్తు తెలియని కారు ఢీకొని వృద్ధుడు తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం ములకలచెరువు మండలంలో జరిగింది. వేపూరికోట పంచాయతీ రెడ్డివారిపల్లెకు చెందిన కొండ్రెడ్డి(65) ద్విచక్రవాహనంలో గ్రామంలో నుంచి రోడ్డుపైకి రాగా, గుర్తు తెలియని కారు వేగంగా వచ్చి ఢీకొంది. ప్రమాదం జరిగిన వెంటనే కారు అక్కడి నుంచి వెళ్లిపోయింది. గమనించిన స్థానికులు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కొండ్రెడ్డిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ములకలచెరువు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
నడిరోడ్డుపై కారు దగ్ధం
మదనపల్లె రూరల్ : నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కారు దగ్ధమైన ఘటన ఆదివారం మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని నక్కలదిన్నెకు చెందిన ఎస్.రఘునాథ్, ఆదివారం ఉదయం ఏపీ–39, ఏఎన్4008 హ్యుందయ్ సాంత్రో కారులో నక్కలదిన్నె నుంచి నీరుగట్టువారిపల్లెకు వెళుతుండగా మార్గంమధ్యలోని కదిరిరోడ్డు రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ వద్ద అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగాయి. దీంతో ఆందోళనకు గురై కారు దిగి బయటికి వచ్చేశారు. అందరూ చూస్తుండగానే కళ్ల ఎదుట కారు దగ్ధమైంది. గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే కారు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కారు ఇంజిన్ వద్ద పెట్రోల్ పైపు లీకేజీ కారణంగా మంటలు చెలరేగి ప్రమాదం జరిగిందని అగ్నిమాపకశాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదంలో రూ.4 లక్షల నష్టం వాటిల్లినట్లు కారు యజమాని రఘునాథ్ తెలిపారు.
యువకుడి ఆత్మహత్యాయత్నం


