వెల్లివిరిసిన మతసామరస్యం
లక్కిరెడ్డిపల్లి : కులమతాలకు అతీతంగా అయ్యప్ప మాల ధరించిన భక్తులకు.. ముస్లింలు అన్నప్రసాదం ఏర్పాటు చేయడంతో మతసామరస్యం వెల్లివిరిసింది. మండల పరిధిలోని నామాలగుట్టపై వెలసిన అయ్యప్పస్వామి ఆలయంలో ఆదివారం మదీనా మసీదు కమిటీ సభ్యులు, ముస్లింలు.. అయ్యప్ప మాల ధరించిన భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అయ్యప్ప మాలధారణ భక్తులు, ముస్లింలు కలిసిమెలిసి స్వామి వారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఇలాగే ఎప్పుడూ హిందూ, ముస్లిం అని తేడా లేకుండా కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసి మెలిసి జీవించాలని వారు కోరారు. అనంతరం నిర్మాణంలో ఉన్న అయ్యప్పస్వామి ఆలయాన్ని అయ్యప్ప భక్తులతో కలిసి ముస్లింలు సందర్శించారు. ఈ సందర్భంగా ముస్లింలు మాట్లాడుతూ తమవంతుగా అయ్యప్ప ఆలయ నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి వెంకటేష్, గంగరాజు, ముస్లింలు, అయ్యప్ప మాలధారణ భక్తులు తదితరులు పాల్గొన్నారు.
అయ్యప్ప భక్తులకు ముస్లింలు
అన్నప్రసాదం ఏర్పాటు


