రెచ్చిపోయిన మట్టిమాఫియా
రాయచోటి : మట్టి మాఫియా రెచ్చిపోయింది.మట్టికోసం తెలుగు తమ్ముళ్లు కత్తులు, రాడ్లతో బాహబాహీకి దిగారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో మట్టి మాఫియా రెచ్చిపోతోందనడానికి శుక్రవారం సాయంత్రం రాయచోటి – గాలివీడు మార్గంలోని రింగ్ రోడ్డు వద్ద జరిగిన దాడి సంఘటన నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మట్టి తరలింపులో తెలుగు తమ్ముళ్ల గ్రూపుల మధ్య తలెత్తిన వివాదం దాడులకు దారి తీసింది. దాడిలో తమ్ముడు పదిలం శివ శంకర్ కత్తిపోట్లకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, మరో తమ్ముడు చలమారెడ్డి స్వల్ప గాయాలతో బయట పడినట్లు సమాచారం. రాయచోటి రూరల్ మండల పరిధిలోని వరిగ గ్రామం శెట్టి వాండ్లపల్లి సమీపంలోని చౌడచెరువు నుంచి ప్రతిరోజు తెలుగు తమ్ముళ్లు పోటాపోటీగా మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం వసంత వెంకట చలమారెడ్డి, మరో వర్గానికి చెందిన పదిలం శివ శంకర్ ల మధ్య వివాదం తలెత్తింది. వీరిద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. చలమారెడ్డి తన చేతిలోని కత్తితో పదిలం శివను గాయపరిచినట్లు పోలీసులు తెలిపారు. శివకు రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. శివ ఫిర్యాదు మేరకు చలమారెడ్డి పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు రాయచోటి పోలీసులు తెలిపారు.
● కత్తులు రాడ్లతో తమ్ముళ్ల దాడులు
● పదిలం శివ శంకర్‌కు కత్తిపోట్లు


