మదనపల్లె రూరల్ : వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం చల్లావారిపల్లె పంచాయతీ వడ్డిపల్లెకు చెందిన డిగ్రీ చదువుతున్న యువతి(19) శుక్రవారం ఇంటి వద్ద పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. తల్లిదండ్రులు పెళ్లి సంబంధం చూడటంతో.. ఇష్టం లేక మనస్తాపం చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు బాధితురాలిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వారు తిరుపతికి రెఫర్ చేశారు. అదేవిధంగా గుర్రంకొండ మండలం ఎల్లుట్ల పంచాయతీ పసలవాండ్లపల్లెకు చెందిన ఓబుల్‌రెడ్డి కుమారుడు వెంకటరమణారెడ్డి పొలం దక్కదన్న మనస్తాపంతో పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇటీవల రెవెన్యూ అధికారులు స్థానికుల ఫిర్యాదుతో భూమి సర్వే చేశారు. అందులో వెంకటరమణారెడ్డికి చెందిన 38 సెంట్ల పొలం ప్రభుత్వ భూమిగా తేల్చారు. దీంతో తనకు పొలం దక్కకుండా పోతుందని మనస్తాపం చెంది ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆయా ఘట నలపై సంబంధిత పోలీసులు విచారణ చేస్తున్నారు.


